విశాఖపట్టణం జిల్లాలోని విస్సన్నపేట భూముల్లో నిబంధనలకు విరుద్దంగా రియల్ ఏస్టేట్ వ్యాపారం సాగుతుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.
విశాఖపట్టణం: ఉత్తరాంధ్ర భూములను వైఎస్ఆర్‌సీపీ నేతలు దోపీడీ చేస్తున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. సోమవారంనాడు విశాఖపట్టణం జిల్లాలోని విస్సన్నపేటలో భూములను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విస్సన్నపేటలో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసే సంస్థలకు అనుమతి లేదని ఆయన ఆరోపించారు. వాల్టా చట్టానికి విరుద్దంగా పనులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఎక్కడా అభివృద్ధి లేదన్నారు. ఉత్తరాంధ్రలో యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి కోసం ఉత్తరాంధ్ర యువత ఎక్కడెక్కడికో వలసలు పోతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఉత్తరాంధ్ర భూములను దోపిడి చేస్తుంటే మాట్లాడేవారు లేరని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కానీ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు.నిబంధనలకు విరుద్దంగా రియల్ ఏస్టేట్ వ్యాపారం సాగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ దోపీడికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడ వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. అడ్డగోలుగా దోచేస్తుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దళితులకు పట్టా ఇచ్చిన భూముల్లో రోడ్లు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు.