శ్రీకాకుళంలో వలస వచ్చిన 120 పెలికాన్ పక్షులు మృతి.. కారణం ఇదేనంటా..!

By Mahesh KFirst Published Jan 20, 2022, 1:41 PM IST
Highlights

శ్రీకాకుళానికి వలస వచ్చిన పక్షులు కొన్ని మరణించిన ఘటన కలకలం రేపింది. కొంగ జాతికి చెందిన సుమారు 120 పెలికాన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. ఇవి ఇన్ఫుయెంజా వైరస్‌తో మరణించాయా? లేక విషం తిని మరణించాయా? అనే అంశాలపై చర్చ జరిగింది. కానీ, తాజాగా ఆ పక్షులను పోస్టు మార్టం చేసి ధ్రువీకరించిన కారణాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అవి పరాన్నజీవులతో కలిగే ఇన్ఫెక్షన్ వల్ల మరణించి ఉండవచ్చని రిపోర్టులు తెలిపాయి. ఒక జీవిలో ఎన్నో పరాన్న జీవులు ఉంటాయి. పరాన్న జీవులు సాధారణంగా వాటికి ఆశ్రయం ఇచ్చిన జీవులకు హాని కలిగించవు. ఒక వేళ ఆ పరాన్న జీవుల వల్లే వాటికి ఆశ్రయం ఇచ్చిన జీవులు మరణిస్తే దాన్ని ప్యారాసిటిక్ ఇన్ఫెక్షన్ అంటారు.
 

అమరావతి: శ్రీకాకుళంలోని శాంక్చుయరీలు విశిష్టమైనవి. ఇక్కడకు ప్రతి ఏడాది అక్టోబర్‌లో విదేశాల నుంచి అనేక జాతుల పక్షులు వస్తాయి. ఇందులో కొంగజాతికి చెందిన పెలికాన్ పక్షులు కూడా ఉంటాయి. ఈ పక్షులు అందరూ నాలుగు లేదా ఆరు నెలలపాటు ఈ శాంక్చుయరీల్లోనే ఉంటాయి. ఇక్కడే గుడ్లు పెట్టి.. పొదుగుతాయి. మళ్లీ మార్చి లేదా మే నెలల్లో కొత్తగా జన్మించిన పిల్లలతో తిరిగి వెళ్లిపోతాయి. శ్రీకాకుళంలోని శాంక్చుయరీలకు ఇంతటి ప్రత్యేకత ఉన్నది. అందుకే ఇక్కడ పక్షులకు ఏం జరిగినా చర్చనీయాంశం అవుతుంది. ఇటీవలే పక్షుల్లోకెల్లా అతి పొడవైన ముక్కు కలిగిన పెలికాన్ పక్షులు అంతుచిక్కని కారణంతో మృత్యువాత పడ్డాయి. 100 నుంచి 120 పెలికాన్ పక్షులు చనిపోయాయి. వీటి మృతిపై అనేక అనుమానాలు బయల్దేరాయి. తాజాగా, ఈ మరణాలు ఫ్లూ వైరస్‌తోనో, విషం తీసుకుననో సంభవించలేదని తేలింది. పరాన్నజీవులకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌లతో మరణించినట్టు ధ్రువీకరించాయి.

ఈ ఉదంతంపై టెక్కలి ఫారెస్ట్ రేంజ్ అధికారి పీవీ శాస్త్రి మాట్లాడారు. కొన్ని పెలికాన్ పక్షులు అంతుచిక్కని కారణాలతో తెలినీలపురంలో మృత్యువాత పడ్డాయని తెలిపారు. ఈ మరణాలు ఎందుకు చోటుచేసుకున్నాయో తాము గుర్తించలేకపోయామని చెప్పారు. అందుకే యానిమల్ డిసీజ్ డయాగ్నస్టిక్ ల్యాబరేటరీకి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్‌కు విజ్ఞప్తులు చేశామని, ఈ పక్షుల మరణాలకు కారణాలను కనుగొనాలని కోరామని వివరించారు. ఆ పక్షులకు పోస్టుమార్టం నిర్వహించి కారణాలను ధ్రువీకరించాలని విన్నవించామని తెలిపారు.

ఈ పెలికాన్ పక్షుల్లోని అదనపు జీర్ణాశయంలో కాంట్రకెయమ్ వోమ్స్ పెద్ద సంఖ్యలో ఉన్నట్టు గుర్తించామని ల్యాబరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పీ మోహిని కుమారి వివరించారు. కాబట్టి.. పరాన్నభుక్కల కారణంగానే పెలికాన్ పక్షులు మృతి చెందినట్టు తెలుస్తున్నదని తెలిపారు. ఇన్‌ఫ్లుయెంజా కారణంగా ఈ పక్షులు మరణించి ఉండొచ్చనే వదంతులకు తెరపడింది. అయితే, ఈ ప్యారాసిటిక్ ఇన్ఫెక్షన్ ఎలా అభివృద్ధి చెంది ఉండొచ్చని అడగ్గా... ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పీవీ శాస్త్రి సమాధానం ఇచ్చారు. వలస వచ్చిన పక్షులు అన్నీ 500 ఎకరాల్లోని ఈ చెరువుల్లోని చేపలనే ఆహారంగా తీసుకుంటాయని తెలిపారు. పెలికాన్ పక్షులు సుమారు ఐదు కిలోల చేపలను సైతం తన ముక్కుతో పట్టుకుని మింగేయగలవని వివరించారు. చేపల్లో కనిపించిన పరాన్న జీవులే మరణించిన పెలికాన్ పక్షుల్లోనూ కనిపించాయని పేర్కొన్నారు.

అసలు చేపల్లో ఆ సంఖ్యలో పరాన్న జీవులు ఎలా ఉన్నాయని, కారణాలు వెతికి పట్టుకోవాలని వైజాగ్‌లోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌ అధికారులను కోరామని పీవీ శాస్త్రి తెలిపారు. అలాగే, ఈ వలస పక్షులను కాపాడే చర్యలనూ ఆలోచించాలని కోరినట్టు వివరించారు. సాధారణంగా ఈ  పక్షులు జీవించి ఉన్న చేపలనే తింటాయని, అయితే, చేపల్లో ఈ పరాన్న జీవులో ఎలా వచ్చాయో కనుగొనాలని అన్నారు. ఇప్పుడు తక్షణమే వలస వచ్చిన ఇతర పక్షులను కనుగొనాల్సి ఉన్నదని తెలిపారు. వాటి నుంచి వోమ్స్‌ను వెనక్కి తీసే ఆలోచనలు నిజంగా అంత ప్రయోజనకరం కాదని వివరించారు. ఎందుకంటే కొన్ని పక్షులు గుడ్లు పెడుతుంటే.. మరికొన్ని పక్షులు పొదుగుతుంటాయని అన్నారు. 2020లోనూ విజయనగరంలో కొన్ని వలస పక్షులు విషం తిని మరణించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

click me!