పెదబయలు తహసీల్దారు ఆత్మహత్య.. టిఫిన్ తెమ్మని చెప్పి, అంతలోనే...

By SumaBala BukkaFirst Published Dec 9, 2022, 6:51 AM IST
Highlights

పని ఒత్తిడి మరో అధికారి ప్రాణాలు తీసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్నారు. 

సీతారామరాజు జిల్లా : గురువారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెదబయలు తాసిల్దారు శ్రీనివాసరావు (48)ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయమే ఆఫీసుకు వచ్చిన ఆయన అక్కడి స్టాఫ్ తో టిఫిన్ తెప్పించుకున్నారు. కానీ, అది తినకుండానే ఉరి వేసుకుని చనిపోయారు. ఈ విషయం తెలిసి  కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. అధికారుల మందలింపులు, తీవ్ర పని ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని  వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆఫీసుకు వచ్చిన వెంటనే ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీనివాసరావు విజయనగరంలో పౌర సరఫరా శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేశారు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాకు ప్రమోషన్ మీద వచ్చారు. ఆఫీస్ పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఒంటరిగా ఉండేవాడు. ఆయనకు భార్య లక్ష్మి శివ సరోజా, ఏడాదిన్నర వయస్సున్న చిన్నారి ఉన్నారు. ఆయన సౌమ్యుడిగా పేరుంది. తన వీధుల్లో చాలా నిష్పక్షపాతంగా పని చేసేవారు.

పనిచేస్తున్నారో లేదో , నా మనుషుల నిఘాలోనే .. మీ వల్లకాకుంటే : నేతలకు జగన్ హెచ్చరికలు

ఇటీవల ప్రభుత్వం భూ సర్వే ప్రారంభించింది. సమీక్షలు సమావేశంలో భాగంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. జిల్లా కేంద్రం పాడేరులో ఇటీవల కలెక్టర్ తాసిల్దార్ లతో ఇదే అంశం మీద సమీక్ష కూడా నిర్వహించారు. ఆ సమీక్ష సమయంలో మరో ఇద్దరు అధికారులతో పాటు శ్రీనివాసరావును కూడా కలెక్టర్ తీవ్రస్థాయిలో మందలించారు. అసలే సున్నిత మనస్కుడైన శ్రీనివాసరావు దీంతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ ఒత్తిడి తట్టుకోవడం కష్టంగా ఉందని సిబ్బందితో చెప్పుకొచ్చాడు. తాను చనిపోతానని చెప్పారని సిబ్బంది వాపోయారు. 

ఒత్తిడి సహజమే కానీ అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని.. ఒత్తిడి తగ్గించుకోవడానికి సెలవుపై వెళ్లాలని తాము చెప్పామని  వారు అన్నారు. అయితే ఇంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం నమ్మ బుద్ధి కావడం లేదన్నారు. తాసిల్దార్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న జెసి శివ శ్రీనివాస్, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ ఆర్డీవో దయానిధి పెదబయలు చేరుకున్నారు. పని ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది జేసీకి తెలిపారు. దీనిమీద జేసీ మాట్లాడుతూ బుధవారమే వీడియో కాన్ఫరెన్స్లో ఆయనతో మాట్లాడాలని.. ఆయన ఎందుకు అలా చేశారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

వేరే ఊరిలో ఉంటున్న కుటుంబ సభ్యులు సాయంత్రానికి పెదబయలు చేరుకున్నారు. మృతదేహం దగ్గర వారి రోదనలు మిన్నంటాయి. శ్రీనివాసరావు ఉరివేసుకున్న షెడ్డు ఆరు,ఏడు అడుగులు మాత్రమే ఉంది.  దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. విజయనగరం లేదా విశాఖపట్నంలో తామే పోస్టుమార్టం చేయిస్తామని పట్టుబట్టారు. అయితే,  అలా కుదరదని సంఘటన జరిగిన పోలీస్ స్టేషన్ పరిధిలోని పోస్టుమార్టం చేయించాలని ఎస్పీ సూచించారు.  తాసిల్దార్ ది ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాడేరు తరలించారు.

అయితే తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని పని ఒత్తిడి అయినా కావచ్చు, ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుకు పెళ్లైన పదిహేనేళ్ల తర్వాత పాప పుట్టింది. అంతకు ముందు విజయనగరం జిల్లాలో ఉండేవారు. అక్కడినుంచి అల్లూరి సీతారామజిల్లా అంటే చాలా దూరం.. చంటి పాపను తీసుకుని అక్కడికి వెళ్ళలేను.. అని భార్యాపిల్లలను వదిలేసి వెళ్లాడు. ఆరోగ్యం బాగుండడం లేదు ఏం చేయాలో తెలియడం లేదంటూ విజయనగరం జిల్లా నుంచి వెళ్లే ముందు ఆయన ఆవేదన చెందినట్టుగా తెలుస్తోంది.

click me!