
హైదరాబాద్: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా తెలపెట్టిన హర్తాళ్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ హర్తాళ్‌లో పాల్గొనాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, పెట్రోల్‌ను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాలని జనసేన డిమాండ్ చేస్తూనే వుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతునప్పటికీ మనదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉండటం గర్హనీయమని అన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల పదో తేదీన దేశ వ్యాప్తంగా జరగునున్న హర్తాళ్‌కు జనసేన మద్దతు పలుకుతోందని చెప్పారు. ఆనాటి హర్తాళ్‌లోకార్యకర్తలు పూర్తి శాంతియుతంగా పాల్గొంటారని అన్నారు.
హర్తాళ్‌లో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ సి.పి.ఎం.కార్యదర్శి శ్రీ మధు, సి.పి.ఐ కార్యదర్శి శ్రీ రామకృష్ణ, పి.సి.సి ఆధ్యక్షుడు శ్రీ రఘువీరారెడ్డి కోరినందుకు కృతజ్ఞతలు అంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో అన్నారు.