చంద్రబాబుకు సోమవారం నోటీసులు: హీరో శివాజీ సంచలనం

By pratap reddyFirst Published Sep 8, 2018, 4:33 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలోని రాజ్యాంగబద్ద సంస్థ నుంచి నోటీసులు రాబోతున్నాయని, అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి తనకు సమాచారం వచ్చిందని తెలుగు సినీ హీరో శివాజీ అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలోని రాజ్యాంగబద్ద సంస్థ నుంచి నోటీసులు రాబోతున్నాయని, అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి తనకు సమాచారం వచ్చిందని తెలుగు సినీ హీరో శివాజీ అన్నారు. తనకు నిన్న అర్థరాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. 

ఆపరేషన్ గరుడ రూపం మార్చుకుని మరో రూపంలో రాష్ట్రంపై దాడికి దిగబోతున్నారని, ముఖ్యమంత్రిని రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి ఓ జాతీయ పార్టీ పంజా విప్పిందని ఆయన అన్నారు. ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం భావితరాలను ఇబ్బంది పెట్టడం కాదా అని ఆయన అడిగారు. వివరాలు తాను చెప్పలేనని, తనకు ప్రాణహాని ఉందని ఆయన అన్నారు. 

ప్రజలను పక్కన పెట్టేసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి కాదని అన్నారు. ఆంధ్రప్రేదశ్ రాష్ట్రానికి హోదా ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. 

హక్కుల కోసం అడిగితే వరవరరావును ఏం చేశారో చూశారు కదా అని అయన అన్నారు. రెండు సార్లు తనకు ముప్పు వాటిల్లిందని, మీడియా వల్ల తాను బతికిపోయానని ఆయన అన్నారు. తనకు తెలిసిన విషయాన్ని ప్రజలకు చెప్పానని ఆయన అన్నారు. రాజకీయ వ్యవస్థలకు చట్టాలు చుట్టాలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తన స్థానంలో జగన్ ఉన్నా తన ఆవేదనను ఇలాగే వ్యక్తం చేసేవారని ఆయన అన్నారు. రాష్ట్రంలో నచ్చినవారుంటేనే నిధులు ఇస్తారా అని ఆయన అడిగారు. భగవంతుడే అన్యాయాన్ని అడ్డుకుంటాడని ఆయన అన్నారు. ఎక్కడో ఎవరో ఉంటారని, వారి వల్ల న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. 

click me!