పవన్ కళ్యాణ్ డెసిషన్‌తో పిఠాపురం హైడ్రామా.. చినికి చినికి ఏమవునో?

By Mahesh KFirst Published Mar 14, 2024, 8:58 PM IST
Highlights

పవన్ కళ్యాణ్ నిర్ణయంతో పిఠాపురం నియోజకవర్గం చుట్టూ హైడ్రామా నెలకొంది. ముఖ్యంగా తోటి మిత్రపక్షం టీడీపీ నుంచి మాత్రం నిరసన సెగలే ఆయనకు ఎదురయ్యాయి. ఎస్వీఎస్ఎన్ వర్మ నిర్ణయం చాలా వరకు పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలన్ని ప్రభావితం చేయవచ్చు. పవన్ కళ్యాణ్ బలం అని నమ్మిన కమ్యూనిటీ నుంచే ఉద్ధండుడిని వైసీపీ బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. 
 

గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటి చేసి ఓడిపోయారు. ఈ సారి ఆయన పోటీపై చాలా ఉత్కంఠ నెలకొంది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని, కాదు కాదు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే చర్చ జరిగింది. కానీ, వీటికి తెర దించుతూ పవన్ కళ్యాణ్ ఈ రోజు కీలక ప్రకటన చేశారు. తాను ఎంపీగా పోటీ చేయడం లేదని, పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఆయన చేసిన ఈ ప్రకటన పిఠాపురం నియోజకవర్గాన్ని ఓ హైడ్రామాగా మార్చింది. ఈ రోజు మొత్తంగా ఏపీలో రాజకీయ పరిణామాలు పిఠాపురం చుట్టే తిరిగాయి. ఈ హైడ్రామా ఎటు తిరుగుతుందో.. చినికి చినికి మరే మలుపు తిరుగుతందో అనే సందేహాలు వస్తున్నాయి.

ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సుమారు 90 వేల వరకు కాపులే ఉంటారు. భీమవరం ఓటమి బెంగతో ఆయన కాపుల ఓట్లను చూసి పిఠాపురం వైపు పవన్ అడుగులు వేశారేమో. కానీ, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు చాలా వరకు కాపు నాయకులే ఉంటారు.

పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే వాస్తవానికి పిఠాపురం టికెట్ ఆశిస్తున్న టీడీపీ లీడర్ వర్మ అనుచరులు భగ్గుమన్నారు. ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రేపు తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆయన ఎంతటి తీవ్రమైన నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉన్నది. 2014లో ఇలాగే టీడీపీ టికెట్ ఆశించి భంగపడి స్వతంత్రంగా పిఠాపురం నుంచి పోటీ చేయగా సుమారు 50 వేల మెజార్టీతో గెలిచారు. అప్పుడు వైసీపీ రెండో స్థానంలో ఉంటే.. టీడీపీ డిపాజిట్ గల్లంతైంది. కాబట్టి, వర్మను సింపుల్‌గా తీసుకోవడానికి లేదు. టీడీపీ ఆయనకు టికెట్ కాదంటే స్వతంత్రంగా పోటీ చేసి పరిస్థితులను తారుమారు చేసే సమర్థుడని చెప్పవచ్చు. దీంతో పొత్తులో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌కు టీడీపీ నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు అందకపోవచ్చు.

గతంలో ఒకసారి పీఆర్పీ నుంచి గెలుపొందిన వంగా గీత ఇప్పుడు వైసీపీ ఎంపీ. ఆమెనే పిఠాపురం ఇంచార్జీగా ఉన్నారు. కాపు కమ్యూనిటీకి చెందిన ఆమె పిఠాపురంపై పట్టుకు ప్రయత్నాలు చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. వైసీపీకి మరో అవకాశం కూడా ఉన్నది. ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడిని ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పై నిలబెట్టే అవకాశాలు లేకపోలేదు. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి పెద్దగా భావిస్తుంటారు.

వీటికితోడు సందట్లో సడేమియాగా పవన్ కళ్యాణ్ పై గుక్కతిప్పుకోనీకుండా విమర్శలు చేసే రామ్ గోపాల్ వర్మ కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇది వాస్తవమేనా? కాదా? అని తెలియడానికి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఎస్వీఎస్ఎన్ వర్మ తీసుకునే నిర్ణయంపై రేపటికల్ల ఓ స్పష్టత రావొచ్చు. వైసీపీ నుంచి బరిలో వంగా గీత ఉంటారా? లేక ముద్రగడ పద్మనాభం ఉంటారా? అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది.

click me!