వారిని తప్పకుండా గుర్తించాల్సిందే: పవన్ కల్యాణ్

By telugu team  |  First Published Jul 18, 2020, 3:09 PM IST

కరోనా వైరస్ మీద పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను గుర్తించి, వారిని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. వారి సేవలను గుర్తించి తగిన వెసులుబాట్లు కల్పించాలని అన్నారు.


అమరావతి: కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రతి ఒక్కరూ వణికిపోతుంటే ఆ వైరస్ బారిన పడినవారికి వైద్య సేవలు అందిస్తూ, ఈ క్లిష్ట తరుణంలో ముందుండి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు... ఇలా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరి సేవలు విస్మరించలేనివని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం లో 200 వరకూ వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ స్టాఫ్, 600 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని తెలుస్తోందని, పోలీస్ శాఖలో 10 మంది వరకూ కరోనాకు బలయ్యారని ఆయన అన్నారు. ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందిస్తూ వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రజా సంరక్షణలో పోలీస్, ఇతర విభాగాలు పని చేస్తున్నాయని పవన్ అన్నారు.

Latest Videos

undefined

వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని, కరోనాపై పోరులో ఆ వైరస్ కి బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించకూడదని ఆయన అన్నారు. పరిహారంగా రూ.కోటి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పలువురు విధులకు హాజరవుతూ ఉన్నారని,  ఆ సమయంలో వారు కరోనా బారినపడుతున్నారని అన్నారు. వైద్యానికీ, తదనంతరం తీసుకోవాల్సిన విశ్రాంతికీ నాలుగు వారాల సమయం అవసరం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారని, కాబట్టి ఈ కాలానికి వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నవారికీ ఈ తరహా సెలవులు అవసరమని ఆయన అన్నారు. 

ప్రైవేట్ సంస్థల నిర్వాహకులు కూడా ఈ విషయంలో సానుభూతితో ఆలోచించాలని, యాజమాన్యాలకు ఇబ్బందులు ఉన్నా సంస్థ కోసం పని చేసినవారు అనుకోకుండా కరోనా బారినపడ్డందున సెలవుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. వేతనం కోల్పోతామనే ఆందోళన లేకుండా వారు మానసిక ప్రశాంతతతో త్వరగా కోలుకొంటారని ఆయన చెప్పారు.

click me!