
గుంటూరు జిల్లా నంబూరులో శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఒకే సమయంలో ఆలయం వద్దకు వచ్చిన వీరిద్దరూ పరస్పరం ఎదురుకావడంతో.. ఒకరినొకరు పలకరించుకున్నారు.. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్.. చంద్రబాబులు ఒకరికొకరు కత్తులు దూసుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి పలకరింపులు కొత్త పొత్తులకు దారి తీశాయంటూ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు జనసేనాని.. రాజకీయ నాయకులు అన్నాకా బయట ఏదో ఒక సందర్భంలో ఎదురుపడుతూనే ఉంటారు.. ఇలా తారసపడినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం మామూలే.. ఆ సమయంలో బాగోగులు కనుక్కోవడం జరుగుతుంటుంది. దయచేసి ఇలాంటివి జరిగినప్పుడు ఏదో జరిగిపోతోందని.. కొత్త పొత్తులు పెట్టుకుంటున్నారని ఏదేదో ఊహించుకోవద్దని పవన్ సూచించారు..
నేను ప్రతిరోజూ కలుసుకున్న, పలకరించిన వారిలో చాలా మంది నాకు పరిచయస్తులే అయి ఉంటారు.. రాజకీయ విభేదాలను కేవలం విధానాలపరంగానే చూస్తాను.. వ్యక్తిగత కోణంలో చూడను.. ఇది లోపించడం వల్లే వైసీపీ, టీడీపీలు అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా సాగనీయడం లేదంటూ పవన్ ట్వీట్ చేశారు..