ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్.. వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు..

Published : Sep 05, 2023, 12:37 PM IST
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్.. వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు..

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురు దేవుళ్ళకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురు దేవుళ్ళకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. జన్మనిచ్చిన అమ్మానాన్నల తరువాత అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ళ దగ్గరేనని అన్నారు. ఉపాధ్యాయులు వీసమెత్తు కూడా ప్రతిఫలం ఆపేక్షించకుండా విజ్ఞానాన్ని పంచి.. శిష్యుల విజయాలను వారివిగా భావిస్తారని పేర్కొన్నారు. పవిత్రమైన బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టుగా తెలిపారు. 

తరగతి గది నుంచే ప్రపంచాన్ని పరిచయం చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు- శిష్యులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ది, మన దేశ పురోగతిలో తమ వంతు పాత్రను మరింత సమర్థంగా పోషించాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. 

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారి పట్ల ఆంధ్రప్రదేశ్ పాలకులు, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరి తరచూ విమర్శల పాలవుతోందని అన్నారు. పాలకులు ఉపాధ్యాయ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనే మాట వినిపిస్తూనే ఉందని చెప్పారు. ప్రభుత్వ చర్యలు సైతం అందుకు అనుగుణంగానే ఉంటున్నాయని విమర్శించారు. బోధనేతర విధులతో వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. 

నాడు-నేడు పనుల్లో పాలక పక్షం చేస్తున్న తప్పులకు ప్రధానోపాధ్యాయులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. పదోన్నతులు పొందిన, బదిలీ అయిన సుమారు 30వేల మంది ఉపాధ్యాయులకు కొద్ది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం చేసుకొనే ఈ సమయంలో ఏ ఉపాధ్యాయుడికీ ఇంకా జీతం చెల్లించలేదు అంటే ఈ ప్రభుత్వానికి గురు దేవుళ్లపై ఏ విధమైన ధోరణిని అవలంభిస్తోందో అర్థమవుతోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం కచ్చితంగా బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవమర్యాదలను కాపాడుతుందని హామీ ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YSRCP Leaders Protest at ABN Office: ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ నాయకులు| Asianet Telugu
MP Ambica G Lakshminarayana Speech: అనంతపూర్ ఎంపీ అంబికా పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu