ఎన్నో కష్టనష్టాలకోర్చి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని సమష్టిగా ఈ ఎన్నికల్లో విజయం సాధించామని పవన్ కళ్యాణ్ ఎంపీలతో ప్రస్తావించారు. అదే సమష్టి భావన, కృషి ప్రతి విషయంలోనూ ప్రతిబింబించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి, టూరిజం లాంటి ప్రధాన అంశాలను పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌తో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఇద్దరు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజంలపై దృష్టి పెట్టాలని, ఇటువంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అనుకూలమో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. సత్వర ఉద్యోగ అవకాశాలు పెరిగే టూరిజం, సర్వీస్ రంగాలపై దృష్టి సారిస్తూ ఇవి రాష్ట్రంలో అమలయ్యే విధంగా కేంద్రంలోని మంత్రులతో మాట్లాడాలన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలపై బాగా దృష్టి సారిస్తే మెరికల్లాంటి యువ శాస్త్రవేత్తలు బయటకి వస్తారన్న పవన్ కళ్యాణ్... కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశాలు, మార్గాలు లేక యువత పరిశోధనా రంగం వైపు రాలేకపోతున్నారని చెప్పారు. మనం సరైన దిశగా వారికి అవకాశాలు కల్పిస్తే స్వల్ప ఖర్చుతో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయన్నారు. అదే విధంగా గ్రామీణాభివృద్ధి, గ్రామాల్లో రోడ్లు, తాగునీరు అందించడానికి కేంద్రం నుంచి ఇతోధికంగా నిధులు రాబట్టాలని జనసేన ఎంపీలకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
సమష్టి విజయం ప్రతిబింబించాలి...
ఎన్నో కష్టనష్టాలకోర్చి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని సమష్టిగా ఈ ఎన్నికల్లో విజయం సాధించామని పవన్ కళ్యాణ్ ఎంపీలతో ప్రస్తావించారు. అదే సమష్టి భావన, కృషి ప్రతి విషయంలోనూ ప్రతిబింబించాలని సూచించారు. ఏదైనా ఒక పథకం సాధించినప్పుడు అది వ్యక్తిగతంగా కాకుండా ఎన్డీఏ కూటమి పక్షాన, జనసేన పక్షాన సాధించుకున్నట్టు చెప్పడం మనలోని సమష్టితత్వాన్ని వెల్లడిస్తుందన్నారు. వ్యక్తులకు రావాల్సిన పేరు ప్రతిష్టలకు సంబంధించి తాను సందర్భోచితంగా ప్రతిస్పందిస్తానని తెలిపారు. జనసేన నుంచి లోక్ సభలో స్థానం పొందిన ఇద్దరూ పార్టీ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
ఇద్దరు ఎంపీలు, తనతో సహా 21 మంది ఎమ్మెల్యేలు నెలలో ఒకరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక పూట తమ నియోజకవర్గాల నుంచి వచ్చేవారికి, మరోపూట అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారిని కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ నిబంధనను తక్షణం ప్రతి ఒక్కరూ అమలు చేయాలని కోరారు.
కూరగాయల గుచ్ఛం బహూకరణ...
కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ సందర్భంగా ఎంపీలిద్దరూ కూరగాయల గుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను కలిసేందుకు వచ్చేవారు కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనబడేవి తేవొద్దని సూచించారు. ఇలా పది మందికి కడుపు నింపేవి తీసుకొస్తే బాగుంటుందన్నారు. ఎంపీలు ఇచ్చిన కూరగాయల బొకే ఆనందానికి గురిచేసిందని తెలిపారు. వారి స్ఫూర్తిని మిగతా వారు కూడా కొనసాగించాలన్నారు. ‘పూల బొకేలతో డబ్బు వృథా చేయొద్దు. విగ్రహాల కోసం ఇబ్బందిపడొద్దు. శాలువాలు అసలే తేవద్దు. వాటికి వెచ్చించే మొత్తంతో కష్టాల్లో ఉన్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలో అన్న క్యాంటిన్లు రానున్నాయి. వాటికి ఉపయోగపడేలా టోకెన్స్ లాంటివి తీసుకొని ఇవ్వండి’ అని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు వల్లభనేని బాలశౌరి, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్ కూడా పాల్గొన్నారు.