జగన్ రెడ్డి మళ్లీ చెప్పాలి: కాపు రిజర్వేషన్లపై నిలదీసిన పవన్ కల్యాణ్

By telugu teamFirst Published Jul 25, 2020, 7:46 AM IST
Highlights

కాపు రిజర్వేషన్లను తెర మీదికి తెచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను నిలదీశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయబోమని స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన జగన్ ను డిమాండ్ చేశారు.

అమరావతి: కాపు రిజర్వేషన్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తెర మీదికి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నిలదీశారు. ఎన్నికల సమయంలో మొహమాటం లేకుిండా తాము కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోమని చెప్పారని, అయినా ప్రజలు గెలిపించారని, ఇప్పుడు మరోసారి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోమని జగన్ చెప్తే స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. 

గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్ది స్థిరమైన పాలన అందించే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా జగన్ రాజకీయ కక్ష సాధింపుల కోసం పాలన చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 62 కేసుల్లో తీర్పులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తే చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుంటే ఆ పార్టీ కార్యకర్తల్లాగే ప్రవర్తిస్తుంటే కోర్టులు చూస్తూ ఎలా సహిస్తాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 

ఆయన ఆ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు ఇన్ని కేసుల్లో హైకోర్టు నుంచి ఆక్షేపణలు ఎదుర్కోవడంపై ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. చేసే పనుల్లో తప్పులున్నాయని తెలుసుకోవాలని ఆయన అన్నారు. విధానాలను సరిదిద్దుకోకపోతే ప్రజాగ్రహం చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకు అధికారులు బలి అవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు హైకోర్టుకు ెవళ్లడం ఎప్పుడూ జరగలేదని అన్నారు. ప్రభుత్వం కేవలం కొన్ని వర్గాలకే పనిచేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. 

గత ప్రభుత్వం హయాంలోనే చాలా అప్పులు చేశారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని అప్పులు చేసిందని ఆయన అన్నారు. ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి గానీ అప్పులు చేసే మార్గాలు వెతికి దాన్నే అభివృద్ధి అనడం సరి కాదని ఆయన అన్నారు. 

కరోనా విషయంలో జగన్ చేసిన ప్రకటనలను ఆయన తప్పు పట్టారు. చిన్న ఫ్లూలాంటిదని తేలికగా తీసుకున్నారని, ఇప్పుడు పరిస్థితి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్గా ఉందని, కరోనాతో 700 మందికి పైగా చనిపోయారని ఆయన అన్నారు. ఇన్ని వేల కేసులు రావడానికి ప్రభుత్వం తీరే కారణమని పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. 

click me!