
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టిడిపి జనసేన కూటమి తరఫునుంచి 175 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్, జనసేన ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ పర్యటనల క్రమంలోనే ప్రతి జిల్లాకు పవన్ కళ్యాణ్ మూడు సార్లు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసింది జనసేన. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. ఈ పర్యటనల్లో మొదటి విడత ముఖ్య నేతలతో, రెండో విడత స్థానిక కార్యకర్తలతో సమావేశాలు అవుతారు. ఇక మూడోసారి ప్రజల్లోకి నేరుగా వెళ్లి ప్రచారం చేస్తారు.
ఈ మేరకు అన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ ప్రణాళికల్లో భాగంగానే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఉభయగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతుంది. మొదట ఉదయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ 14 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం జనసేన హెలికాప్టర్ను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పర్యటనల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్ వాడనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఢిల్లీకీ పురంధేశ్వరి, బీజేపీ ముఖ్యనేతలు.. పొత్తులపై చర్చకేనా?
జనసేన ఇప్పటికే టిడిపి తో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి జనసేన బిజెపితో పొత్తులో ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బిజెపి జనసేన టిడిపి మూడు ఉమ్మడిగా బరిలోకి దిగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక 17వ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తో సహా మరి కొంతమంది బిజెపి ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ టిడిపి తో పొత్తు విషయం చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ పొత్తుల విషయం కొలిక్కి వచ్చినట్లయితే, టిడిపి- బిజెపి-జనసేన ఉమ్మడిగా, వైసిపిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రచారంలో జోరు పెంచడం కోసమే హెలికాప్టర్ ని వాడబోతున్నట్లుగా తెలుస్తోంది.