"ఎన్డీయేలోనే ఉన్నా.. ఒకవేళ బయటకు వస్తే నేనే.. తెలియజేస్తా...": పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన 

By Rajesh Karampoori  |  First Published Oct 6, 2023, 6:37 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తన పార్టీపై కాకుండా.. రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టాలని కోరారు.


టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. సమీకరణాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఇక పొత్తుల విషయంలో  పలు కీలక మార్పులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ.. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబోతుంది.

ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఎన్‌డిఎ కూటమి నుండి జనసేన నిష్క్రమించనున్నట్టు పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ ఊహాగానాలన్నింటినీ జనసేనాని తోసిపుచ్చారు. ఎన్డీఏ, జనసేన సోపతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Latest Videos

వారాహి యాత్రలో భాగంగా గురుజలో జనసేనాని మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం ఏన్డీయే కూటమిలోనే ఉన్నననీ, కూటమి నుంచి బయటకు రాలేదని పేర్కొన్నారు. ఒకవేళ వైదొలగే నిర్ణయం తీసుకుంటే.. తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పారు. అందరికీ చెప్పే బయటకు వస్తాననీ, దొంగ వ్యవహారాలు తనకు తెలియదని అన్నారు. తన భవిష్యత్తు నిర్ణయాలను ఇతరులు తీసుకోవాల్సిన అవసరం లేదని జగన్ పార్టీ నేతలపై సైటర్లు వేశారు.  తన పార్టీపై కాకుండా.. రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టాలని హితవు కోరారు.

తాను ఎన్డీయే నుంచి బయటకు వస్తే.. జగన్‌తో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ నేతలకు తెలియజేస్తాననీ, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు ఎలా సాధించాలో  ఆలోచించుకోవాలంటూ వైసీపీ నేతలకు చురకలంటించారు. "నా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ నంబర్లు ఉన్నాయి. నేను ఎన్‌డిఎ కూటమి నుండి బయటకు వస్తే మీకు తెలియజేస్తాను" అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన, అభివృద్ధికి టీడీపీ అవసరమని పవన్ కల్యాణ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బలమైన పార్టీ, రాష్ట్రంలో సుపరిపాలన కోసం, రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అవసరమని తెలిపారు. ఈరోజు టీడీపీ కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితిలో టీడీపీకి జనసేన యువ రక్తం కావాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

అంతకుముందు రోజు.. జనసేన.. ఎన్డీయే నుండి బయటకు వెళ్లడం లేదని, అవసరమైన సమయంలో తెలుగుదేశంకు మద్దతు ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ స్పష్టం చేసింది. కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పలేదని ఆ పార్టీ పేర్కొంది.

పవన్ కళ్యాణ్ ఎన్డీయేలో ఉన్నారనీ, ఇప్పుడు టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టి మేము మద్దతు ఇస్తామని చెప్పడానికి వస్తున్నాం. అంటే ఆయన ఎన్డీయే నుండి వైదొలగడం కాదు, ఎన్డీయేలో భాగమైనప్పటికీ...  ప్రస్తుతం టీడీపీ బలహీనంగా ఉన్నందున పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. 'స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్' కేసులో జ్యుడీషియల్ కస్టడీకి పంపబడిన చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలులో సెప్టెంబర్ 14న పవన్ కళ్యాణ్ పరామర్శించారు. JSP అధినేత పవన్ కళ్యాణ్ కూడా జూలై 18న ఢిల్లీలో జరిగిన NDA సమావేశానికి హాజరయ్యారు. YSRCPని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో TDP, BJP, జనసేనల పొత్తును కూడా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారని వర్గాలు చెబుతున్నాయి. దీనిపై బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

click me!