
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గం పూర్తిగా డైలమాలో పడిపోయింది. తమకు కలగా మిగిలిపోయిన రాజ్యాధికారాన్ని ఎలాగైనా సాధించాలని కాపులు దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్నారు. కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య , దళిత సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి పదవిని అందుకోగా.. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితిలో వుండి కూడా తమ వర్గం నుంచి ఇంత వరకు ఎవరూ సీఎం కాకపోవడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ అసలు లక్ష్యాన్ని సాధించలేకపోయారు. చివరికి పార్టీని నడపలేక దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
మరో సినీనటుడు, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతో మెజారిటీ కాపులు ఆయన వెంట నడుస్తున్నారు. కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కాపుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి. 2014లో పోటీ చేయకుండా టీడీపీ, జనసేనకు మద్ధతు తెలిపిన పవన్ కళ్యాణ్.. 2019లో బరిలోకి కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యారు. పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి అభిమానులకు పీడకలను మిగిల్చారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కొడతానని చెబుతూ వచ్చిన పవన్ .. టీడీపీతో పొత్తుకు సై అన్నారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని చెప్పి ముందుకు సాగుతున్నారు. ఒకసారి టీడీపీ పల్లకీ మోయనని, ఈసారి వీర మరణాలు వుండవని చెబుతూ.. మరోసారి చంద్రబాబుతోనే అంటకాగుతూ వస్తోన్న పవన్ నిర్ణయాలు కాపు వర్గంలో అసంతృప్తికి గురిచేస్తున్నాయి.
వాస్తవానికి జనసేనపై కాపులు ముఖ్యంగా యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పవన్‌ను సీఎంగా చూడాలనేది వారి చిరకాల వాంఛ. కొన్నేళ్ల కిందట కాపునాడు నాయకులు భేటీ అయి.. పవన్ కళ్యాణ్ కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. కానీ జనసేనాని మాత్రం తన కోసం కాకుండా మరో పార్టీ కోసం, ఆ పార్టీ అధినేత కోసం పనిచేస్తున్నారంటూ వారు కుమిలిపోతున్నారు. ఇటీవల కార్తీక వనభోజనాల సందర్భంగానూ కాపు నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. టీడీపీతో పొత్తు వల్ల కాపులకు వచ్చే ప్రయోజనం ఏం లేదని వారి తేల్చిచెప్పేస్తున్నారు. కాపు నాయకులే కాపులకు ద్రోహం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు మంత్రి పదవులతో సరిపెట్టేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులు వ్యక్తిగతంగా ఎదిగేందుకు ప్రయత్నించకుండా.. మరో పార్టీతో అంటకాగితే, రాజ్యాధికారం ఎప్పుడని వారు నిలదీస్తున్నారు. అదే సమయంలో పలువురు జనసేన నేతలు పార్టీ వీడుతున్నారు. గోదావరి జిల్లాల్లో మంచి పట్టున్న మేడా గురుదత్త ప్రసాద్ కొద్దిరోజుల కిందట జనసేనను వీడి అధికార వైపీపీలో చేరారు. ఈ క్రమంలో గురుదత్త ప్రసాద్ జనసేన అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్‌కి కాపులని శాశించే అధికారం లేదని.. కాపు ఆశయాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు మండిపడ్డారు. చంద్రబాబు పల్లకీ మోయడానికి కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావని గురుదత్త ప్రసాద్ ఫైర్ అయ్యారు. ప్రతి రాజకీయ నాయకుడు తన పార్టీ, తన నాయకులు ఎదగాలని కోరుకుంటారు కానీ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం 'పక్క పార్టీ నాయకులు' ఎదగాలని కోరుకోవడం ఏంటో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రం బాగు కంటే తనకి ఏ పదవి ముఖ్యం కాదని పవన్ పదే పదే అంటున్నారని.. పదవి అవసరం లేదని ఎవరితో చర్చించి చెప్పారని గురుదత్త ప్రసాద్ ప్రశ్నించారు.
నారా లోకేష్, చంద్రబాబు నిర్ణయం సరిపోతుంది అనుకుంటే, నీ వెనకాల నీ పార్టీను నమ్ముకుని తిరిగిన జనసైనికుల పరిస్థితి ఏంటి..? నీ వెంట నడిచిన కాపు నాయకుల సంప్రదింపులు నీకు అవసరం లేదా అని ఆయన ఘాటు విమర్శలు చేశారు. కాపుల ఆశయాలకు సాధకుడిగా నిన్ను, నీ పార్టీ జెండాని ఎత్తుకుంటే నువ్వు మాత్రం 'నాకు ఎటువంటి ఆశలు లేవు అని, నీ వెంట నడిచిన వారి గౌరవాన్ని మంటలో కలిపేస్తావా అంటూ ఘాటు విమర్శలు చేశారు. రానున్న రోజుల్లో మేడా బాటలో మరికొందరు నడిచే అవకాశం వుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ కాపు నేతలను బుజ్జగించేందుకు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారో చూడాలి.