వైసీపీ ఎమ్మెల్యేలను కట్టేసి దుక్కిదున్నిస్తాం: పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Dec 5, 2019, 1:04 PM IST
Highlights

రైతుల సమస్యలను పరిష్కరించకపతే రైతులంతా కలిసి వైసీపీ ఎమ్మెల్యేలను కట్టేసి దుక్కిదున్నించే పరిస్థితి వస్తుందన్నారు. అప్పుడైనా రైతు కష్టమేంటో తెలుస్తుందని గట్టిగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నకు భరోసా కల్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల సమస్యలను పరిష్కరించకపతే రైతులంతా కలిసి వైసీపీ ఎమ్మెల్యేలను కట్టేసి దుక్కిదున్నించే పరిస్థితి వస్తుందన్నారు. 

అప్పుడైనా రైతు కష్టమేంటో తెలుస్తుందని గట్టిగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్. వెన్నుముక విరుచుకుని మరీ పంటపండిస్తే ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే ఎందుకని నిలదీశారు. 

తనను ఆపాలని చూస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ హెచ్చరించారు. జగన్ ఆర్నెళ్ల పాలన అంతా చంద్రబాబు ఇళ్లు కూల్చడం, కాంట్రాక్టులు రద్దు చేయడమే తప్ప ఇంకేమీ లేదన్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డును సందర్శించిన పవన్ కళ్యాణ్ టమోటా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. టమోటా రైతుకు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని నిలదీశారు.  అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఆర్నెళ్ల కాలంలో రైతులు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. 

ఏపీలో అమరావతి రచ్చ: చంద్రబాబు మీటింగ్ కు పోటీగా రైతులు సమావేశం

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలాన్ని వృథా చేశారని మండిపడ్డారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఇళ్లు కూల్చడం, గత ప్రభుత్వ హామీలను రద్దు చేయడం ఇవే ఆలోచనలు తప్ప రైతుల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ నిలదీశారు. 

జగన్ దృష్టి అంతా చంద్రబాబు ఇళ్లు కూల్చేద్దాం, రద్దులు చేద్దాం అన్న చందంగానే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన ఏనాడు వైసీపీ ప్రభుత్వానికి గానీ, ఎమ్మెల్యేలకుగానీ జగన్ కు గానీ రాలేదన్నారు. 

టమోటా రైతు గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ను ఎప్పుడు తిడదామా అని ఆలోచిస్తూ రైతులను పట్టించుకోకపోతే చెట్టుకు కట్టేసి రైతుల పొలాలను దున్నిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టమోటా రైతులకు గిట్టుబాటు ధరలపై త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో రైతుల గిట్టుబాటు ధరపై చర్చ జరగకపోతే తానే రైతుల పక్షాన ఉద్యమిస్తానని తెలిపారు. 

 

రైతుల సమస్యలను అడిగి తెలుసుకుందామని తాను ప్రయత్నిస్తే తనను ఆపాలని చూస్తారా అంటూ నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. తనను ఆపడమంటే వైసీపీ తన కుర్చీ తాను కూల్చుకున్నట్లేనని స్పష్టం చేశారు. 

రైతులు కష్టాలను తెలుసుకుందామని తాను పర్యటిద్దామనుకుంటే తనను ఆపాలని చూస్తారా అంటూ నిప్పులు చెరిగారు. తనను ఆపాలని చూస్తే చేతులు ముడుచుకుని కూర్చోనని జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్.   

మరోవైపు జగన్ కు మతమార్పిడులుపై ఉన్న ఉత్సాహం రైతులపై లేదంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయంటూ ధ్వజమెత్తారు. 

మాట్లాడితే జగన్ రెడ్డి ఆంగ్ల మాద్యమం అంటారని ఆంగ్ల భాష తర్వాత ముందు  రైతుల కడుపు నింపాలంటూ సవాల్ విసిరారు. ఇటీవలే భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతుల పొట్టకొడుతుందని మండిపడ్డారు. 

justice for disha:12 మందితో సిట్ ఏర్పాటు

ఆంగ్ల భాష పెట్టినంత మాత్రాన టమోటా రైతుల కష్టాలు తీరుతాయా అంటూ మండిపడ్డారు. ముందు టమోటా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి వారి కడుపు నింపాలని ఆ తర్వాత ఆంగ్ల భాష గురించి మాట్లాడు కోవచ్చన్నారు. 

రైతులను ఆదుకోలేని వైసీపీ ప్రభుత్వానికి 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా ఒక్కటేనన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే ఎందుకు రోడ్లపై తిరిగారంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్. ఇకనైనా జగన్ రెడ్డి మారాలంటూ సూచించారు. 

రైతులకు జగన్ రెడ్డి ఒక భరోసా ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకపోతే అమరావతిలో భారీ ప్రదర్శన చేస్తానని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.  

click me!