
హైదరాబాద్: తాను బిజెపితో కలిసి పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. బిజెపికి నష్టం కలగకూడదని పవన్ కల్యాణ్ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేని బిజెపిని వెనకేసుకుని రావడం వల్ల తమకు వచ్చే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎపి ప్రజలు పూర్తిగా బిజెపిని వదిలేశారని, అలాంటి పార్టీతో రాష్ట్రంలో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని ఆయన అన్నారు.
ఈ మేరకు ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ తన వాదనను వినిపించారు. ఇంకా చంద్రబాబును మిత్రునిగానే చూస్తున్నామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అంటున్నారని, దాన్ని బట్టి చంద్రబాబు చేస్తున్నది ధర్మ పోరాటమని ఎలా నమ్ముతామో చెప్పాలని ఆయన అన్నారు.