Pawan Kalyan| తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్

By Rajesh KarampooriFirst Published Apr 17, 2023, 1:38 PM IST
Highlights

Pawan Kalyan| తెలంగాణ ప్రజలకు వైసీపీ (YCP) నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) డిమాండ్‌ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరనీ, ఆ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Pawan Kalyan| ఆంధ్ర ప్రదేశ్ మంత్రులకు, వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హితవు పలికారు. పొరుగు రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.  తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఉద్దేశించి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ పరిణామంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... హరీశ్ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని... కానీ, ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం దురదృష్ణకరమని అన్నారు. ఒక జాతిని అవమానించేలా ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే..వైసీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారని జనసేనాని ప్రశ్నించారు. విమర్శించాలనుకుంటే.. సదరు మంత్రిని గానీ, సదరు ఎమ్మెల్యేను గాని.. వ్యక్తిగతంగా విమర్శించాలే కానీ... తెలంగాణ రాష్ట్ర ప్రజలను విమర్శించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పవన్‌ కల్యాణ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్ పై వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం... ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా మారింది.’అని పేర్కొన్నారు. ‘గతంలో కూడా నాయకులకు నేను ఒకటి చెప్పాను. పాలకులు పేరు ప్రజలు వేరు. పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదు. మంత్రి హరీష్ రావు గారు ఏ సందర్భంగా వ్యాఖ్యాలు చేశారో తెలియదు. దానికి ప్రతి స్పందనగా వైసీపీ నాయకులు, మంత్రులు తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా మనస్తాపం కలిగించింది.’అని తెలిపారు. 

ఏపీ మంత్రులకు హితవు పలుకుతూ.. ‘దయ చేసి వైసీపీ నాయకులకు నా విన్నపం... నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. సదరు తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయి అనుకుంటే ఆయన్నే విమర్శించండి. అంతేకానీ తెలంగాణ ప్రజలను వివాదాల్లోకి లాగవద్దు. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు దీనిపై స్పందించాలి.’అని సూచించారు. 

‘మీకు తెలంగాణలో ఇళ్లు, వ్యాపారాలు ఉన్నాయి. బొత్స గారు లాంటి వాళ్లు ఇక్కడ వ్యాపారాలు చేసిన వాళ్లే కదా? బొత్స గారి కుటుంబానికి ఇక్కడ కేబుల్ వ్యాపారం ఉండేది. దయచేసి మంత్రి వర్గంలో ఎవరైనా అదుపు తప్పి మాట్లాడితే తోటి మంత్రులతోపాటు ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలను ఖండించాలి. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.’అని హెచ్చరించారు. 

ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... ఏపీకి, తెలంగాణకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని, ఏపీతో పోలిస్తే..  హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులు ఎంతో బాగున్నాయని అన్నారు. ఏపీలో రోడ్లు, ఇతర సౌకర్యాలు, సేవలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని, ఏపీ నుంచి వలస కార్మికులు ఏపీలో ఓటును వదిలేసి, తెలంగాణలో ఉంచుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజులు విమర్శలు గుప్పించారు.
 

తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM

— JanaSena Party (@JanaSenaParty)
click me!