హైదరాబాదులో చేసిన తప్పే ఇక్కడా చేస్తున్నారు: బాబుపై పవన్ నిప్పులు

First Published May 31, 2018, 5:33 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. 

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. హైదరాబాదులో చేసిన తప్పే ఇక్కడా చేస్తున్నారని, అభివృద్ధిని ఒక ప్రాంతంలో కేంద్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. తన జనసేన పోరాట యాత్రలో భాగంగా ఆయన గురువారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో మాట్లాడారు.

రాష్ట్ర విభజన వల్ల సొంత రాష్ట్రంలోనే మనం పరాయివాళ్లం అయిపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతాల్లోనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. దానివల్ల తెలంగాణ ఉద్యమం లాగా కళింగాంధ్ర ఉద్యమం తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. 

కళింగాంధ్రను నిర్లక్ష్యం చేశారనే భావన ఉత్తరాంధ్ర మేధావుల్లో వ్యక్తమవుతోందని అన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు విభజన సమస్యలే తలెత్తుతాయని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని అన్నారు. 

బలిజపేట మండంలోని గ్రామాల్లో ప్రజలు బోదకాలు వ్యాధితో బాధపడుతున్నారని, ఎంపీలు గానీ ఎమ్మెల్యేలు గానీ పట్టించుకోవడం లేదని, రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి కూడా లేరని ఆయన అన్నారు. ఉద్ధానం సమస్య తమ పార్టీ వల్లనే వెలుగులోకి వచ్చిందని, నాలుగేళ్ల క్రితం పుట్టిన పార్టీ అంత చేయగలిగితే అధికారంలో ఉన్నవాళ్లు ఎంత గలరో ఆలోచించాలని, కానీ చేయడం లేదని అన్నారు. 

click me!