
విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోవడాన్ని కూడా చంద్రబాబు ప్రచారానికి వాడుకున్నారని పవన్ విమర్శించారు. చంద్రబాబు తీరు శవాలమీద పేలాలు ఏరుకున్నట్టు ఉందని మండిపడ్డారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాము ఎన్నో సమస్యలను గుర్తించామని బాధితులకు సరైన సాయం అందలేదని పవన్ తెలిపారు.
అసలు చంద్రబాబు తిత్లీ తుఫాన్ ను ప్యూర్లీ పీఆర్ ఎక్సర్‌సైజ్ చేస్తారా? నేను ఎంత బాగా చేస్తున్నాను అని అనడం మాకు చాలా బాధకలిగించిందని అన్నారు. ఇది శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా ఉందని దుయ్యబుట్టారు. ఇలాంటి పరిస్థితిలో పీఆర్ ఎక్సర్‌సైజ్ ఎవరైనా చేస్తారా? అని చంద్రబాబును నిలదీశారు.
ఇది అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి అవసరాలు ఉండకూడదనే కదా జనసేన పార్టీ చంద్రబాబుకు అండగా ఉందని పవన్ గుర్తు చేశారు. జనసైనికులం చాలా బాధ్యతగా ఉంటామని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని చెప్పారు. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లు విమర్శించమని పవన్ స్పష్టం చేశారు.