పొత్తులు ప్రజలకు ఉపయోగపడాలి.. ఏపీ భవిష్యత్తుకు చాలా మంది కలిసి పనిచేయాలి: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Published : May 08, 2022, 03:36 PM ISTUpdated : May 08, 2022, 04:35 PM IST
పొత్తులు ప్రజలకు ఉపయోగపడాలి.. ఏపీ భవిష్యత్తుకు చాలా మంది కలిసి పనిచేయాలి: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేది కావాలన్నారు. వ్యక్తిగతంగా తాను ఏ లాభాపేక్ష కోరుకోనని చెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి.. వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద పవన్ కల్యాణ్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ పవన్ కల్యాణ్ అక్కడి నుంచి ముందుకు సాగారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేనను బలోపేతం చేసే దిశగా  అడుగులు వేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. ఇది వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ అద్భుత పాలన చేయవచ్చని అన్నారు. కానీ సంఖ్య బలం ఉందని దౌర్జన్యం చేసే పరిస్థితులు ఉన్నాయని.. వారు పద్దతి మార్చుకోవాలని  సూచించారు. యువతకు ఉద్యోగాలు లేవని.. ఎవరైనా గొంతు ఎత్తితే వారిపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చర్యలకు జనసేన వెనక్కి తగ్గదని.. ఈ తరం అసలు తగ్గదని అన్నారు.  

చంద్రబాబు త్యాగాలకు సిద్దమని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించిన పవన్ కల్యాణ్.. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేది కావాలన్నారు. వ్యక్తిగతంగా తాను ఏ లాభాపేక్ష కోరుకోనని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ మరింతగా అంధకారంలోకి వెళ్లిపోతుందని, పరిస్థితులు మరింతగా దిగజారిపోతాయని చెప్పారు. 

ఓటు  చీలిపోతే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు చాలా మంది కలిసి పనిచేయాలన్నారు. విశాల దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు భరోసా కల్పించడానికి.. ఎంతవరకు అందరూ కలిసి వస్తారనేది భవిష్యత్తులో తేలుతుందన్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవరసం ఉందన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నారు. ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్టుగా చెప్పారు.

ప్రస్తుతానికి తమకు బీజేపీతో పొత్తు ఉందని చెప్పారు. బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అంటే గౌరవం ఉందన్నారు. రోడ్ మ్యాప్‌పై సరైన సమయంలో స్పందిస్తామని చెప్పారు. 

అంతకుముందు..  పాణ్యం నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. వారి కటుంబ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సుబ్బరాయుడు ఆత్మహత్యకు గల కారణాలను.. ప్రభుత్వం స్పందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. జనసేన తరఫున వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. 

అనంతరం ఆత్మహత్య చేసుకున్న మరో కౌలు రైతు చిన్న హుస్సేనీ కుటుంబానికి పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత నంద్యాల నియోజకవర్గం జిల్లెళ్ళలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు గైని నరహరి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నరహరి 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వేరుశెనగ వేశారని.. సరైన దిగుబడి రాక, కౌలు డబ్బులు కట్టుకోలేక అప్పుల పాలయ్యారని కుటుంబ సభ్యులు చెప్పారు. భారీగా అప్పులు ఎదురుగా కనిపించే సరికి ఏం చేయాలో తెలియక.. వాటిని తీర్చే దిక్కులేక పురుగుల మందు తాగి పొలంలోని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. 

ఇలా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించుకుంటూ ముందుకు సాగుతున్న పవన్ కల్యాణ్.. ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert: ఇక కాస్కోండి.. తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే. భారీ వ‌ర్షాలు.
CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu