ఓటుకు నోటు కేసుకు భయపడే...: చంద్రబాబు పవన్ కల్యాణ్ నిప్పులు

First Published May 28, 2018, 7:02 AM IST
Highlights

ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు 36 సార్లు మాట మార్చారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు.

శ్రీకాకుళం: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు 36 సార్లు మాట మార్చారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో భయపడే కేంద్రాన్ని ప్రశ్నించలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీతోనైనా, బీజేపీతోనైనా కలిసే పోటీచేస్తారని వ్యాఖ్యానించారు. 

శ్రీకాకుళం జిల్లా పోరుయాత్రలో భాగంగా ఆదివారం నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటించారు. వంశధార ప్రాజెక్టును పరిశీలించారు. నిర్వాసితుల గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అంతర్భాగమేనని, ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు అని, రాష్ట్రానికి హోదా ఇవ్వకుంటే మరింత వెనక్కి పోతుందని అన్నారు ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్యాకేజీయే కావాలని కేంద్రాన్ని సీఎం కోరారని, ఓటుకునోటు తర్వాత అలా మిన్నకుండిపోయారని ఆయన అన్నారు. 

హోదా కోసం జనసేన పోరాడితే టీడీపీ తక్కువచేసి మాట్లాడారని, ఇప్పుడేమో హోదా మాట వల్లెవేస్తూ ధర్మపోరాట దీక్షలు చేపడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాల వల్ల కేంద్రం వద్ద అలుసైపోయామని అన్నారు. మోడీ ప్రభుత్వం విభజన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 

రాష్ట్రంలో ఇసుకమాఫియా డబ్బంతా టీడీపీ నేతల వద్దే ఉందని, భూమి కనపడితే చాలు లొట్టలేసుకుని మరీ పంచుకుంటున్నారని, వంశధార, నాగావళి, బహుదా నదుల్లో ఇసుక తవ్వకాలతో ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు తెగ సంపాదించేశారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని అన్నాురు.
 
ఆంధ్రప్రదేశ్‌ను ఇష్టానుసారంగా కాంగ్రెస్‌ విభజించిందని, ఆ పార్టీ నాయకులతోనే చంద్రబాబు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారని, కర్ణాటకలో రాహుల్‌గాంధీతో అత్యంత చనువుగా ఉన్నారని, ఆయన్ను తాకుతూ హుషారుగా కనిపించారని అన్నారు. 
 
అమరావతిలో ఐదు అంతస్తుల భవనం నిర్మించాలంటే రెండు అంతస్తుల గోతులు తవ్వాలని, అక్కడ తవ్వితే డబ్బులు మిగులుతుంటాయని, ఇక్కడేమో వంశధార ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు నిర్వాసితులైనా వారి గోడు సీఎంకు పట్టదని పవన్ కల్యాణ్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

click me!