
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొన్నారు. ఇందుకోసం ఈరోజు ఉదయం పవన్ కల్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లాకు జనసేనాని బయలుదేరి వెళ్లారు. పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. మల్లికార్జున్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు.
మల్లికార్జున కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక, పలు గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కూడా పరామర్శించనున్న పవన్ కల్యాణ్.. వారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ చింతలపూడి వద్ద రచ్చబండలో పాల్గొననున్నారు.