పోలవరంలో అవకతవకలు జరిగాయి..పవన్ సంచలన వ్యాఖ్యలు

First Published Dec 7, 2017, 12:25 PM IST
Highlights
  • పోలవరం ప్రజెక్టులో అవినీతి జరిగిందని పవన్ కల్యాణ్ నిర్ధారణకు వచ్చినట్లున్నారు.

పోలవరం ప్రజెక్టులో అవినీతి జరిగిందని పవన్ కల్యాణ్ నిర్ధారణకు వచ్చినట్లున్నారు. అందుకే కేంద్రానికి లెక్కలు చెప్పటంలో రాష్ట్రప్రభుత్వం వెనకాడుతోందన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు. గురువారం ఉదయం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి సహజమేనని అంగీకరించారు. అంటే పోలవరంలో కూడా అవినీతి జరిగిందని అంగీకరించినట్లైంది. అందుకే కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం లెక్కలు చెప్పటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై  రాష్ట్రప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మీడియాతో చాలా ఆవేశంగా మాట్లాడిన పవన్ పలు విషయాల్లో ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. అయితే, ఎక్కడ కూడా చంద్రబాబునాయుడు పేరును నేరుగా ప్రస్తావించకపోవటం గమనార్హం. పోలవరంకు సంబంధించి రాష్ట్రప్రభుత్వంలో లోపాలున్నాయి కాబట్టే కేంద్రానికి లెక్కలు చెప్పటానికి భయపడుతోందన్నారు. ప్రాజెక్టు ఏ ఒక్క పార్టీకి సంబంధించినది కాదని పవన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం అందరినీ విశ్వాసంలోకి తీసుకుంటే ఎక్కడ కూడా సమస్యలుండవు కదా అంటూ చురకలంటించారు.

2018లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని స్పష్టంగా చెప్పారు. ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రభుత్వం చెప్పే మాటలు విని విసుగొచ్చేసిందన్నారు. ఈ ప్రాజెక్టును ఎవ్వరూ రాజకీయాలకు వాడుకోకూడన్నారు. పోలవరం అన్నది ఎన్నికల ప్రాజెక్టు కాకూడదన్నారు. ప్రాజెక్టు అంచనాలను లెక్క కట్టడంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనబడుతోందని చెప్పారు. ప్రాజెక్టు కాస్ట్ లో రూ. 33 వేల కోట్లు పునరావాసానికే ఖర్చవుతుందన్న అంచనా వేయటంలో ప్రభుత్వం ఘోరంగా ఫైయిల్ అయ్యిందని మండిపడ్డారు.

పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవటం వాస్తవమేనన్నారు. పనుల్లో జరుగుతున్న జాప్యం కారణంగానే ప్రాజెక్టు అంచనావ్యయాలు విపరీతంగా పెరిగిపోతోందన్నారు. అంచనా వ్యయం రేపు రూ. 65 వేల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నారు. కేంద్రానికి ప్రాజెక్టు లెక్కలు చెప్పాలన్నపుడు అవకతవకలు బయపడుతుందని రాష్ట్రప్రభుత్వం వెనకడుతోందన్న అర్ధం వచ్చేట్లు పవన్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్ళాయా అన్న అనుమానాన్ని పవన్ వ్యక్తం చేయటం గమనార్హం. కేంద్రం అనుమానాలను తీర్చాలంటే రాష్ట్రప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. లెక్కలు చెప్పనంత వరకూ నిధుల కోసం కేంద్రాన్ని నిలదీసే అవకాశం లేదని పవన్ స్పష్టంగా చెప్పారు.

click me!