ఆంధ్రప్రదేశ్ లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి గెలుపునకు కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవులు దక్కనున్నాయి.
జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
కాగా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేసి ప్రభంజనం సృష్టించింది. వంద శాతం స్ట్రైక్ రేట్‌తో 21 స్థానాలను గెలుచుకుంది. అలాగే, అమలాపురం, మచిలీపట్నం పార్లమెంటు స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించింది.
ఇక, చంద్రబాబు కేబినెట్లో కీలక పదవులను జనసేన దక్కించుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. కేంద్ర కేబినెట్లో టీడీపీకి రెండు పదవులు దక్కిన నేపథ్యంలో.. రాష్ట్రంలో కీలక పదవుల కోసం జనసేన పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోని జనసేనాని పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వం ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించగా... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం భిన్నంగా ముందుకు సాగుతోంది. పవన్ కల్యాణ్ కు మాత్రమే డిప్యూటీ పదవి కేటాయించనున్నారు. పవన్ తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు బాబు కేబినెట్లో మంత్రి హోదా దక్కనుంది.