Latest Videos

చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులెవరో తెలుసా..? పవన్‌కు ఏ పదవి..?

By Galam Venkata RaoFirst Published Jun 11, 2024, 8:11 AM IST
Highlights

ఏపీలో విజయ ఢంకా మోగించింది ఎన్డీయే కూటమి. ఇవాళ (మంగళవారం) జరిగే ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశానంతరం చంద్రబాబును కూటమి నేతగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపాదన చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంత్రివర్గంలోకి ఎవరికి, ఎంత మందికి చోటు దక్కుతుందన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది. 

కేంద్రంలో ఎన్‌డీయే నేతృత్వంలోని మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. కేంద్ర కేబినెట్‌ పదవులు, శాఖల కేటాయింపు అంతా పూర్తయిపోయింది. ఐదుగురు తెలుగువారు కేంద్ర మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్‌పై ఉంది. ఈ నెల 12న (బుధవారం) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరికి ఏ పదవి దక్కుతుందన్న చర్చ జరుగుతోంది.

అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాకముందు నుంచే గెలుపుపై ధీమాగా ఉన్న చంద్రబాబు... అప్పటి నుంచే మంత్రివర్గం కూర్పుపై సమాలోచనలు చేస్తున్నారు. అవి దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం సీఎంగా చంద్రాబాబు ప్రమాణం చేసేందుకు చకాచకా ఏర్పాట్లు జరిగిపోతున్న నేపథ్యంలో సోమవారం టీడీపీ నేతలంతా అధినేత నివాసానికి క్యూ కట్టారు. అయితే, చంద్రబాబు ఎవరితోనూ ప్రత్యేకించి మాట్లాడలేదట. నేతల సమక్షంలోనే మాట్లాడి పంపించేశారట. కాగా, ఈసారి ఎమ్మెల్యేల్లో మహిళలు, యువత సంఖ్య పెరిగింది. సీనియర్లూ ఎక్కువ మందే ఉన్నారు. మరి ఎంతమందికి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కుతుందన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది.

మంత్రివర్గం కూర్పుపై చంద్రబాబు క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. మిత్రపక్ష పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే జనసేన అధినేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయనొక్కరే డిప్యూటీగా ఉండనుండగా.... జనసేన తరఫున మరో ముగ్గురికి మంత్రివర్గంలో అవకాశమిచ్చే ఛాన్స్‌ ఉంది. కాగా,  హోం శాఖ కూడా కేటాయిస్తారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో మిత్రపక్ష పార్టీ అయిన బీజేపీ నుంచి ఇద్దరిని రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకొనే అవకాశం ఉంది.

click me!