
జనసేన పార్టీ పెట్టిన ఇంతకాలానికి ప్రజసమస్యపై పవన్ స్పందించటం శుభపరిణామమే. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం మండలంలోని కిడ్నీ బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ ప్రకటించారు. బాధితులతో ఇచ్చాపురంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.
దశాబ్దాల తరబడి ఈ ప్రాంతాల్లోనే కిడ్నీ సమస్య ఎందుకు ఇబ్బంది పెడుతోందో తెలుసుకునేందుకు జనసేన తరపున ఐదుగురితో ఓ కమిటి వేయటం సమస్య పరిష్కారం పట్ల పవన్ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.
పార్టీ తరపున నియమించిన కమిటి సమస్య మూలాలు, పరిష్కారంపై 15 రోజుల్లో నివేదిక అందిస్తుందని కూడా చెప్పారు. అదే సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు పవన్ కొన్ని ప్రశ్నలు వేశారు కొన్ని సూచనలు చేశారు.
కిడ్నీ బాధితులకు ప్రభుత్వం తరపున ఏమి చేయబోయేది 48 గంటల్లోగా ప్రకటించాలని డెడ్ లైన్ విధించారు. బాధితులకు ఆర్ధికసాయం, అనాధలైన బాధిత కుటుంబాల్లోని పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకోవటం లేదా వారి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని కోరారు.
15 రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత ఉద్ధానం సమస్యను సిఎంను కలిసి వివరిస్తానన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజా ఉద్యమంగా చేపడుతానని పవన్ హెచ్చరించటం గమనార్హం.
పుష్కరాలకు వందల కోట్లు, రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తునున్న ప్రభుత్వం కిడ్నీ సమస్య పరిష్కారం కోసం రూ. 100 కోట్లు వ్యయం చేయలేందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కూడా ఓ కమిటి వేయాలని డిమాండ్ చేసారు.
దశాబ్దాల తరబడి ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యను ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోకపోవటం నిజంగా బాధకరమన్నారు.
ఉద్ధానం సమస్య అంతుచూస్తానని పవన్ చెప్పటం మంచిదే. పవన్ అడిగినట్లు నిజంగానే ప్రజప్రతినిధులు ఇన్ని సంవత్సరాలూ ఏమి చేస్తున్నారో? ప్రజలను పార్టీలు ఓట్లుగానే చూస్తున్నాయంటూ విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దృష్టి పెట్టాలని సూచించారు.
సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సంస్ధల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. దశాబ్దాలుగా వేలాది మందిని పొట్టనబెట్టుకుంటున్న కిడ్నీ సమస్యకు పవన్ రూపంలోనైనా పరిష్కారం దొరికితే అంతకన్నా కావాల్పిందేముంటుంది.