‘హిందీ టీచర్ నాతో అలా ప్రవర్తించాడు..’ బాలిక ఫిర్యాదుతో టీచర్లమీద దాడి, పరస్పర ఫిర్యాదులు.. ఉద్రిక్తత...

By AN Telugu  |  First Published Sep 8, 2021, 9:52 AM IST

అది చూసిన ప్రిన్సిపల్ గుత్తా శ్రీనివాసరావు వారిని అడ్డుకుని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఆగ్రహంతో ఉన్న బాలిక బంధువులు ఆయన మీద కూడా దాడి చేయగా తోటి ఉపాధ్యాయులు అడ్డుకోవడానికి రాగా వారినీ కొట్టారు. ఆ తరువాత బాలిక ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హిందీ టీచర్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. 


గుంటూరు : తన పట్ల హిందీ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తెలపడంతో ఆమె బంధువులు అతడి పై దాడికి పాల్పడిన ఘటన స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాలిక బంధువులు, తోటి ఉపాధ్యాయులు తెలిపిన వివరాల మేరకు...

పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక తన చేతిని హిందీ ఉపాధ్యాయుడు రవిబాబు సోమవారం రెండుసార్లు పట్టుకుని గట్టిగా నొక్కారంటూ ఇంటివద్ద తల్లిదండ్రులకు చెప్పుకుని వాపోయింది. దీనిమీద ఆగ్రహించిన ఆమె బంధువులు  మంగళవారం ఉదయం పాఠశాల వద్దకు వెళ్లి తరగతి గదిలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు రవిబాబును  బయటికి పిలిచి తరుముకుంటూ కొట్టడం మొదలుపెట్టారు. 

Latest Videos

అది చూసిన ప్రిన్సిపల్ గుత్తా శ్రీనివాసరావు వారిని అడ్డుకుని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఆగ్రహంతో ఉన్న బాలిక బంధువులు ఆయన మీద కూడా దాడి చేయగా తోటి ఉపాధ్యాయులు అడ్డుకోవడానికి రాగా వారినీ కొట్టారు. ఆ తరువాత బాలిక ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హిందీ టీచర్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. 

హైస్కూల్ లో టీచర్ల మీద, తన మీద దాడి చేసిన వారిపై ప్రిన్సిపల్ గుత్తా శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు దాడి సమాచారం అందుకున్న చేబ్రోలు సీఐ మధుసూదనరావు, వట్టి చెరుకూరు ఇన్ ఛార్జి ఎస్సై రాజ్ కుమార్ స్కూల్ కు వెళ్లి టీచర్లు, బాలిక బంధువులతో మాట్లాడారు. 

ఈ సంఘటన మీద బుధవారం జిల్లా ఉపవిద్యాశాఖాధికారి విచారించేందుకు పాఠశాలకు వస్తున్నట్లు ఎంఈవో రమాదేవి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు. 

కాగా, వట్టి చెరుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన వివాదం, దాడి మీద ఇరువర్గాలు తమకు న్యాయం చేయాలంటూ గుంటూరులోని కార్యాలయంలో దక్షిణ మండలి డీఎస్పీ ప్రశాంతిని కలిశారు. విద్యార్థిని, ఆమె కుటుంబసభ్యలు ఘటనకు కారణమైన టీచర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 

కాగా పాఠశాలలోకి దౌర్జన్యంగా ప్రవేశించి దాడి చేయడంమీద ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు డీఎస్పకి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రెండు ఫిర్యాదులమీద కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడతామని డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. 


 

click me!