యజమానిని కిడ్నాప్ చేసి, రూ. 4 కోట్లు వసూలు.. జేసీబీ డ్రైవర్ నిర్వాకం..

By SumaBala BukkaFirst Published Oct 21, 2023, 11:05 AM IST
Highlights

తన యజమానిని కిడ్నాప్ చేసి నాలుగు కోట్లు వసూలు చేసిన ఓ జేసీబీ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 14మందిని అదుపులోకి తీసుకున్నారు. 

కర్నూలు : తిన్నింటి వాసాలు లేకపెట్టినట్టుగా వ్యవహరించాడో జెసిబీ డ్రైవర్. ఏకంగా తన యజమానినే కిడ్నాప్ చేశాడు. అతని దగ్గరి నుంచి రూ.4 కోట్లు వసూలు చేశాడు. ఈ ఘటన గత జూన్లో జరగగా..అప్పటినుంచి నిందితులను వెతుకుతున్న పోలీసులు… ప్రస్తుతం ప్రధాన నిందితుడుతో సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. గతంలోనే ఇంకో 11 మందిని అరెస్టు చేశారు. యజమాని నుంచి వసూలు చేసిన మొత్తంలో వీరి నుంచి రెండు విడతల్లో రూ.3.6కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వినాయక రెడ్డి అనే వ్యక్తి బనగానపల్లి పట్టణ నివాసి. ఆయన క్రషర్ వ్యాపారం చేస్తూనే కర్నూలు ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికవేత్తగా పేరొందాడు.  అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి  వినాయక రెడ్డి దగ్గర నాలుగేళ్లుగా జెసిబి డ్రైవర్ గా  చేస్తున్నాడు.

ధర్మవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు రూ.1.60 కోట్ల జరిమానా.. ఎందుకంటే...

చేరిన మొదట్లో బాగానే ఉన్న ఆ తర్వాత నరేష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇది గమనించిన వినాయక రెడ్డి నరేష్ ను పనిలో నుండి తొలగించాడు. దీంతో నరేష్ రగిలిపోయాడు. ఎలాగైనా సరే యజమాని దగ్గర నుంచి కోట్ల రూపాయలు రాబట్టాలనుకున్నాడు.  దీనికోసం యజమానునే కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు.  ఈ పథకాన్ని అమలు చేయడం కోసం అనంతపురానికి చెందిన రవికుమార్, రంజిత్ కుమార్, చెన్నా భాస్కర్, రఘు, కర్ణాటక,  కోలార్ కు చెందిన సురేష్, ఖలందర్,  శ్రీనివాస్, విజయ్, భార్గవ్,  అజయ్, ప్రకాష్, ప్రభు, రంజిత్ లతో కలిసి ప్లాన్ వేశాడు.

వీరి పథకంలో భాగంగానే జూన్ మూడవ తేదీన బనగానపల్లిలో వీరంతా కలిసి రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత ఐదవ తేదీ ఉదయం కారులో బయలుదేరిన వినాయక రెడ్డి ఆయన కుమారుడు భరత్ రెడ్డిని నాలుగుకారులలో వెంబడించి కిడ్నాప్ చేశారు. వారిని కత్తులతో బెదిరించి తమ కారులో ఎక్కించడానికి ప్రయత్నించారు.  దీనికి వినాయక్ రెడ్డి డ్రైవర్ సాయినాథ్ రెడ్డి అడ్డుపడగా అతనిని కూడా వారి కారులోకి బలవంతంగా నెట్టి ఎత్తుకెళ్లారు.

ఆ తర్వాత వినాయక రెడ్డి తండ్రి నాగిరెడ్డికి ఫోన్ చేసి బెదిరించారు.  నాలుగు కోట్లు ఇవ్వకపోతే వారందరిని చంపుతామని బ్లాక్ మెయిల్ చేశారు. నాగిరెడ్డి వారి బెదిరింపులతో తీవ్రంగా భయపడిపోయాడు. బంధువుల దగ్గర డబ్బులు తీసుకుని మొదటి విడతగా రెండు కోట్ల రూపాయలను అనంతపురం జిల్లా కొత్తపల్లి వద్ద కిడ్నాపర్లకు ఇచ్చాడు. రెండో విడతలో మరో రెండు కోట్ల డబ్బులను  కర్ణాటక అప్పగించాడు. ఈ డబ్బులు అందిన తర్వాత ఏడవ తేదీన కర్ణాటకలో వినాయక రెడ్డి, ఆయన కొడుకు భరత్ కుమార్ రెడ్డి,  డ్రైవర్ సాయినాథ్ రెడ్డిలను విడిచిపెట్టారు.  

డబ్బులు కిడ్నాపర్లకు ముట్టజిప్పినా.. వినాయక రెడ్డి తండ్రి ఆందోళనతో పోలీసులను ఆశ్రయించాడు.  డబ్బులు ఇచ్చినా తన మనవడిని, కొడుకును వదిలిపెట్టరేమో అని అనుమానించాడు. నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే కిడ్నాప్ కురైన ముగ్గురు ఇంటికి వచ్చారు. వారి నుంచి విషయం తెలుసుకున్న పోలీసులు జూన్ 30వ తేదీన 11మందిని గుత్తి పట్టణంలో అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ.40  లక్షల నగదు,  మూడు సెల్ ఫోన్లు, నాలుగుకార్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టి.. ఈ శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

click me!