
మరికొద్దినెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్ధుల ఎంపిక, నిధుల సమీకరణ , ప్రచార వ్యూహాలపై కార్యాచరణ రూపొందిస్తున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, పవర్ సొంతం చేసుకోవాలని టీడీపీ పావులు కదుపుతున్నాయి. ఈ రెండు పార్టీలు కాకుండా ఈసారి జనసేన పార్టీపై అందరి చూపు వుంది. 2014లో పార్టీ పెట్టినప్పటికీ .. అప్పటి పరిస్ధితుల రీత్యా పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్ధతిచ్చారు పవన్. 2019కి వచ్చే నాటికి కూటమి నుంచి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేసి కేవలం రాజోలు ఒక్క చోటే నెగ్గగలిగింది జనసేన. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.
పార్టీ ఓడిన దానికంటే పవన్ పరాజయం పాలవ్వడాన్ని జనసేన కార్యకర్తలు, అభిమానులు తట్టుకోలేకపోయారు. ఈ ఓటమిని గుర్తుచేస్తూ వైసీపీ నేతలు పదే పదే పవన్‌ను దెబ్బిపొడిచేవాళ్లు. పవన్ కళ్యాణ్ కూడా తానేంటో ఈసారి చూపిస్తానంటూ సవాళ్లు విసిరేవారు. దీనిలో భాగంగా గాజువాక, భీమవరం స్థానాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల్లో మాదిరే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేస్తారా లేక ఒక స్థానంతో సరిపెడతారా అన్నది చూడాలి.
ఎటు పోయి ఎలా వచ్చినా భీమవరంలో మాత్రం పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. గతంలో జరిగిన తప్పులు జరగకుండా గెలుపు బాట పట్టేందుకు కావాల్సిన అన్ని రకాల అస్త్రశస్త్రాలను పవన్ సిద్ధం చేశారని టాక్. ప్రజలతో మమేకం కావాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. మరి భీమవరంలో పవన్ కల్యాణ్‌కు ప్రత్యర్ధి ఎవరు .. ఈ ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెరదించారు.
ఇటీవల భీమవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి .. స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన రీల్ హీరో కాదు.. రియల్ హీరో అంటూ కితాబిచ్చారు. గతంలో పోటీ చేసిన సినీ హీరో (పవన్) మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తానని అంటున్నారని.. కానీ నేను రియల్ లైఫ్ హీరోని నిలబెడుతున్నానని గ్రంధి శ్రీనివాస్‌ను ప్రజలకు పరిచయం చేశారు. అతనికి మరోసారి అవకాశం ఇవ్వాలని జగన్ పేర్కొన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో మారుమారు గ్రంథి శ్రీనివాస్‌కు టికెట్ కన్ఫర్మ్ చేశారు సీఎం.
అయితే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా ధృవీకరించలేదు. కాకినాడ, తిరుపతి తదితర నియోజకవర్గాలు కూడా పవన్ లిస్టులో వున్నాయి. వీటిలో ఒక దానిని ఎంచుకుంటారా..? లేక గతంలో మాదిరిగా రెండు స్థానాలు కావాలా అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.