
తమకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని మరో టీడీపీ నేత పార్టీకీ రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన జెడ్పీ మాజీచైర్మన్ గుత్తుల బులిరాజు దంపతులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గొల్లపాలెంలో వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు. టీడీపీలో జిల్లాస్థాయి గుర్తింపు పొందిన తనకు ప్రస్తుతం పార్టీలో సరైనగుర్తింపు లభించకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్టు జెడ్పీ మాజీ చైర్మన్ గుత్తుల బులిరాజు, మాజీ జెడ్పీటీసీ గుత్తుల సత్యాదేవి తెలిపారు.
జెడ్పీ వైస్‌చైర్మన్‌గా, చైర్మన్‌గానే కాకుండా కార్యకర్తగా టీడీపీకి చేసిన సేవల్ని పార్టీ గుర్తించకపోవడం దారుణమని బులిరాజు వాపోయారు. గత ఎన్నికల్లో కాజులూరు మండలం నుంచి జెడ్పీటీసీకి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసి టీడీపీకి మేలు చేసే ఉద్దేశంతో ఉపసంహరించుకున్నప్పటికీ పార్టీ ముఖ్యులు తనని గుర్తించలేదని బులిరాజు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్లే ప్రస్తుతం పార్టీని వీడుతున్నామని తెలిపారు.