మరోసారి పవన్ కల్యాణ్ కు ఝలక్: జగన్ కు జైకొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

By telugu teamFirst Published Jan 4, 2020, 1:18 PM IST
Highlights

తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ఝలక్ ఇచ్చారు. వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆయన జైకొట్టారు. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.

తిరుపతి: జనసేన శానససభ్యుడు రాపాక వరప్రసాద్ మరోసారి తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఝలక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన మరోసారి సమర్థించారు. 

శనివారం ఉదయం రాపాక వరప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయం సరైందేనని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదును మాత్రమే అభివృద్ధి చేశారని, నిధులను అక్కడే ఖర్చు చేసి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. 

నవరత్నాల వంటి కార్యక్రమాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని, చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఇబ్బంది కలిగిస్తుందని అంటూనే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దానిపై ఆయన నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు.

click me!