కరోనాతో చనిపోయిందని ఆంత్యక్రియలు చేస్తే... ఆటోలో తిరిగొచ్చిన మహిళ (వీడియో)

By Arun Kumar PFirst Published Jun 2, 2021, 4:43 PM IST
Highlights

 పదిహేనురోజుల క్రితమే చనిపోయిందని భావించిన మహిళ హటాత్తుగా ఆటోలో తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. 

అమరావతి: కరోనాతో చనిపోయిందనుకుని అంత్యక్రియలు కూడా పూర్తయిన తర్వాత ఓ మహిళ ఆటోలో ఇంటికి తిరిగివచ్చిన విచిత్ర సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా పదిహేనురోజుల క్రితమే చనిపోయిందని భావించిన మహిళ హటాత్తుగా ఆటోలో తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగ్గయ్యపేటలోని కొలిమిబజారుకు చెందిన ముత్యాల గిరిజమ్మ అనే మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు మే 12న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అయితే మూడు రోజుల చికిత్స అనంతరం 15వ తేదీన గిరిజమ్మ మరణించిందని కుటుంబసభ్యులకు తెలిపిన డాక్టర్లు మృతదేహాన్ని అప్పగించారు. కరోనాతో చనిపోవడంతో  వెంటనే దహన సంస్కారాలు చేశారు. 

వీడియో

అంత్యక్రియలతో పాటు దశదినకర్మ ఇలా ఇప్పటికే చివరి సంస్కారాలన్నీ పూర్తి చేశారు కుటుంబసభ్యులు. అయితే బుధవారం హటాత్తుగా గిరిజమ్మ ఇంటికి రావడంతో ఆశ్చర్యపోవడం కుటుంబసభ్యుల వంతయ్యింది. చనిపోయన ఆమె ఎలా తిరిగొచ్చిందని భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఆమె చెప్పిన విషయాల ద్వారా అసలు నిజమేమిటో బయటపెట్టింది. 

read more   విశాఖలో భయపెడుతున్న బ్లాక్ ఫంగస్, ఆరుగురి మృతి.. సెంచరీకి చేరువలో కేసులు

 పోలికలు కొంచెం అటుఇటుగా ఉన్న మహిళ చనిపోవడంతో అది  గిరిజమ్మే అని భావించిన డాక్టర్లు కుటుంబసభ్యులకు అప్పగించారు. వారు కూడా అలాగే తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. అయితే కరోనా నుండి కోలుకున్న గిరిజమ్మను ఆస్పత్రి బుధవారం నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో ఆమె ఆటోలో ఇంటికి వచ్చేసరికి స్థానికులు హతాశులయ్యారు. 

విజయవాడ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ గందరగోళం నెలకొంది. ఎవరు చనిపోయారో కూడా తెలియకుండా మృతదేహాన్ని ఎలా అప్పగించారంటూ గిరిజమ్మ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గిరిజమ్మ కుమారుడు రమేశ్ బాబు కూడా మే 23 న కరోనాతో మృతిచెందాడు.
 

 

click me!