ప్రవీణ్ ప్రకాష్ పై ఎల్వీకి ఫిర్యాదు: ఆ అధికారిపై కూడా బదిలీ వేటు

By telugu team  |  First Published Nov 8, 2019, 10:25 AM IST

ప్రవీణ్ ప్రకాశ్ మీద ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేసిన గురుమూర్తి అనే అధికారిపై కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఎల్వీ బదిలీ తర్వాత గురుమూర్తిని కూడా బదిలీ చేయడం ఆశ్చర్యకరంగా మారింది.


విజయవాడ: సంచలనం కలిగించిన ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో అధికారిపై బదిలీ వేటు వేసింది. అదనపు కార్యదర్శి కె. గురుమూర్తిని సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) నుంచి పంపించి వేశారు.

కొద్ది రోజుల క్రితం గురుమూర్తి జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ మీద ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశారు. గురుమూర్తిని బదిలీ చేయడాన్ని బట్టి ప్రవీణ్ ప్రకాశ్ అధికార కేంద్రంగా మారుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Latest Videos

Also Read: ఎల్వీని బదిలీ చేసిన నోటీసు: నిబంధనల ప్రకారమే.. ప్రవీణ్ ప్రకాశ్ క్లారిటీ

ప్రవీణ్ ప్రకాశ్ కు నోటీసు ఇవ్వడంతో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి జగన్ ప్రభుత్వం తప్పించిన విషయం తెలిసిందే. అందరి ముందు తనను ప్రవీణ్ ప్రకాశ్ తిడుతున్నారని ఆరోపిస్తూ తనను మరో శాఖకు బదిలీ చేయాలని గురుమూర్తి ఎల్వీని కోరారు.

ఆ ఫిర్యాదుతో ప్రవీణ్ ప్రకాశ్ ని, గురుమూర్తిని ఎల్వీ సుబ్రహ్మణ్యం పిలిపించి రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. దాంతో వివాదం ముగిసినట్లే కనిపించింది. అయితే, ఆశ్చర్యకరంగా గురుమూర్తిని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు 

ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వరని, ప్రతిదాన్నీ వాయిదా వేస్తూ ఆలస్యం చేస్తుంటారని, తప్పు చేయకున్నా ఇతరులపై నిందలు వేస్తారని, చాలా సార్లు ఇతరుల ముందు తనను తిడుతూ అవమానించారని గురుమూర్తి ఎల్వీకి ఫిర్యాదు చేశారు. 

తాను 1993 సివిల్ సర్వీస్ పరీక్ష పాసయ్యానని, తనకు 24 ఏళ్ల సర్వీసు ఉందని, ఇటువంటి స్థితిలో తిట్లు తినడం భరించలేనని, ఆయన కింద పనిచేయడం కష్టమని అని గురుమూర్తి ఎల్వీకి లేఖ రాస్తూ తనను వేరే శాఖకు బదిలీ చేయాలని కోరారు. 

Also Read: కోరి కొనితెచ్చుకున్న సీఎం జగన్ : కేంద్ర సర్వీసులకు ఎల్వీ ప్రసాద్...?

ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బలపరుస్తున్నారనే ఉద్దేశంతో ఉన్న జగన్ గురుమూర్తిని కూడా బదిలీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఎల్వీ సుబ్రహ్మణ్యం సెలవుపై వెళ్లారు. 

click me!