బద్వేల్ ఉపఎన్నిక: టీడీపీ అభ్యర్ధిగా ఓబుళాపురం రాజశేఖర్.. చంద్రబాబు కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Sep 3, 2021, 9:49 PM IST
Highlights

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసింది. ఓబుళాపురం రాజశేఖర్‌ను అభ్యర్ధిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతిలో బద్వేల్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. 

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసింది. ఓబుళాపురం రాజశేఖర్‌ను అభ్యర్ధిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం కడప జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అలాగే జిల్లాలో పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా భూపేశ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి , బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కుమారుడే భూపేశ్ రెడ్డి. 

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతిలో బద్వేల్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే సుబ్బయ్య ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో పాటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయన అనారోగ్యానికి గురవడంతో కడపలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈ ఏడాది మార్చి 28న తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. ఆయన మృతితో ఆయన కుటుంబంలోనే కాదు పార్టీలోనూ విషాదం నెలకొంది.

click me!