జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల సత్తా.. ఐదు అవార్డులు గెలుచుకున్నాం: డీజీపీ గౌతమ్ సవాంగ్

By telugu teamFirst Published Sep 3, 2021, 8:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ పోలీసుల సేవలు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయని, ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో స్తతా చాటిందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డుల్లో ఐదు రాష్ట్ర పోలీసు శాఖ దక్కించుకన్నదని తెలిపారు. ఈ అవార్డులు తమపై బాధ్యతను మరింత పెంచాయని వివరించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటిందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ వినియోగంలో రాష్ట్ర పోలీసులను నాలుగు అవార్డులు వరించాయని వివరించారు. ఇందులో పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు మూడు, అనంతపురం పోలీసులకు ఒక అవార్డు దక్కిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021 ప్రకటించిందని తెలిపిన ఆయన రాష్ట్ర పోలీసులు ఈ అవార్డుల్లో తమ సత్తా చాటారని వివరించారు.

జాతీయ స్థాయిలో పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో వరుసగా మూడో సారి ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్‌మెంటే మొదటిస్థానంలో నిలిచిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాష్ట్రంలో కేవలం రెండు రోజుల్లోనే పాస్‌పోర్టు దరఖాస్తు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతున్నదని వివరించారు. టెక్నాలజీ ఫీల్డ్‌లో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, హెచ్ఏడబ్ల్యూకే, బాడీ వోర్న్ కెమెరా స్ట్రీమింగ్, కొవిడ్ ట్రాకర్‌ విభాగాల్లో ఏపీ పోలీసులు సమర్థతను చాటారని తెలిపారు. స్వల్ప నెలల వ్యవధిలోనే ఏపీ పోలీసు శాఖ 130 అవార్డులను కైవసం చేసుకుని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్ 2021లో నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకున్న ఏకైక శాఖ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖనేని అని డీజీపీ గౌతమ్ చెప్పారు. ఈ అవార్డులు తమపై బాధ్యతను మరింత పెంచాయని, మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో త్వరితగతిన సేవలందించడానికి కృషి చేస్తామని వివరించారు. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విజేతలను సీఎం జగన్ మోహన్ రెడ్డి అభినందించారని, పోలీసు శాఖకు ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతతోనే పోలీసు శాఖ సత్ఫలితాలు సాధిస్తున్నదని తెలిపారు.

click me!