NTR University: రేపటి నుంచి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉద్యోగుల విధుల బహిష్కరణ.. నిధుల మళ్లింపుపై ఆగ్రహం

By team teluguFirst Published Nov 30, 2021, 5:35 PM IST
Highlights

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ (NTR Health University) నిధుల మళ్లింపు వ్యవహారంపై యూనివర్సిటీ ఉద్యోగులు (University Employees) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లుగా ఉద్యోగులు స్పష్టం చేశారు. 

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ (NTR Health University) నిధుల మళ్లింపు వ్యవహారంపై యూనివర్సిటీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల మళ్లింపును నిరసిస్తూ.. యూనివర్సిటీ ఆవరణలో ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లుగా ఉద్యోగులు స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం సమావేశమైన ఉద్యోగులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం ఉద్యోగులు , విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వీసీ, రిజిస్ట్రార్‌లకు వ్యతిరేకంగా వర్సిటీలో బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. 

యూనివర్సిటీకి చెందిన బ్యాంకు డిపాజిట్లను.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూనివర్శిటీ అభివృద్ధికి, సిబ్బందికి జీతాలు, పెన్షన్ల కోసం ఉద్దేశించిన నిధులను.. ఎలాగైనా కాపాడుకుంటామని వారు అంటున్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఈ పరిణామాలపై నివేదిస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. 

సీఎం కార్యాలయం నుంచి వస్తున్న ఒత్తిడితోనే యూనివర్సిటీ నిధులు మళ్లిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ కన్వీనర్‌ వెంకటనారాయణ మాట్లాడుతూ.. యూనివర్సిటీ నిధుల మళ్లింపుపై ఆందోళన చేస్తామన్నారు. ప్రభుత్వానికి అప్పులు దొరక్క సంస్థల నిధులు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక, ఈనెల 13న సమావేశమైన ఎన్టీఆర్ యూనివర్సిటీ పాలకమండలి.. విశ్వవిద్యాలయం నిధులను వడ్డీ ఎక్కువగా ఇచ్చే బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలని తీర్మానించింది. ఆ తర్వాత ఈ నెల 25న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంబంధిత సంస్థలు తమ వద్ద ఉన్న ప్రజాధనాన్ని ఏ ఇతర బ్యాంకుల్లో జమ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం తెలిపింది. వీటిని ఏపీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్​లో డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది.  ఈ క్రమంలోనే ఎన్టీఆర్ యూనివర్సిటీ నిధులు మళ్లించాలని ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరిగాయని సిబ్బంది చెబుతున్నారు.

click me!