
గాజువాకలో సంచలనం సృష్టించిన సోము నాయుడు పాలెంలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడి గొరుసు రామిరెడ్డి (31) హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకూ వీడింది. చెల్లెలి వరుసయ్యే అమ్మాయిని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వేదింపులకు గురి చేయడంతో.. ఆ ఓ యువతి(20) తన ప్రియుడు, మరో వ్యక్తి సాయంతో గత నెల 27న రాత్రి రామిరెడ్డిని అంతమొందించారు. సంఘటన స్థలంలో దొరికిన చున్నీ ఆధారంగా పరవాడ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
గాజువాక పోలీస్ స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ రామాంజనేయులు రెడ్డి, పరవాడ, గాజువాక సీఐలు జి. ఉమామహేశ్వరరావు, మల్లేశ్వరరావు వివరాలు వెల్లడించారు.
పరవాడ మండలం వాడ చీపురుపల్లి దరి గొరుసువానిపాలేనికి చెందిన గొరుసు రామిరెడ్డి ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతని ఇంట్లో గతంలో బంధువు, చెల్లెలు వరసైన యువతి ఉంటూ గాజువాకలోని మాల్ లో పనిచేస్తుండేది. అప్పట్లో రామిరెడ్డి ఓ వీడియో తీసి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
విసుగు చెందిన ఆమె వేరే ఇంటికి వెళ్లిపోయింది. అయినా రామిరెడ్డి మారలేదు. ఆమెను వేధించడం ఆపలేదు. దీంతో దాసరిపేటకు చెందిన ప్రియుడు దాసరి కల్యాణ్ కు విషయం చెప్పింది. నిత్యం వేధిస్తున్నాడని చెప్పడంతో వీరిద్దరూ అతన్ని చంపాలని ప్లాన్ చేశారు.
గత నెల 27 సాయంత్రం రామిరెడ్డిని రమ్మని ఆమె ఫోన్ చేసింది. రామిరెడ్డి టూ వీలర్ మీద మాల్ దగ్గరికి వెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ టూ వీలర్ మీద ఎస్టీపీసీ దగ్గర్లోని సోము నాయుడుపాలెంలో రోడ్డు పక్కన చీకటి ప్రాంతానికి చేరుకున్నారు. వీరిద్దరినీ వెంబడిస్తూ మరో బైక్ మీద ఆమె ప్రియుడు దాసరి కల్యాణ్, అతని ఫ్రెండ్ మైచర్ల దుర్గారావులు అక్కడికి వచ్చారు.
యువతి, రామిరెడ్డి ఓ గట్టుమీద కూర్చుని మాట్లాడుతుండగా కల్యాణ్, దుర్గారావులు వెనకనుంచి కర్రలతో రామిరెడ్డి తలమీద బలంగా కొట్టారు. ఆ తర్వాత యువతి చున్నీని మెడకు బిగించారు. ఊపిరాడక రామిరెడ్డి చనిపోయాడు. ఆయన దగ్గరున్న ఫోన్ తీసుకుని ముగ్గురూ అక్కడ్నుంచి పరారయ్యారు.
ఆ మర్నాడు సంఘటనా స్థలాన్ని చేరుకున్న పరవాడ పోలీసులు అక్కడ లభించిన చున్నీ, ఇతర ఆధారాలతో దర్యాప్తు చేయగా ఆ యువతి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి విచారణ జరిపారు. ఆధారాలు దొరకడంతో నిందుతులైన యువతి, కల్యాణ్, దుర్గారావును అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రామాంజనేయులు తెలిపారు.