టీడీపీ అధినేత భద్రతపై ఎన్ఎస్ జీ ప్రత్యేక దృష్టి.. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిని పరిశీలించిన డీఐజీ

By Bukka SumabalaFirst Published Aug 26, 2022, 8:04 AM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతమీద ఎన్ఎస్ జీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే గురువారం టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంట్లో తనిఖీలు చేసింది. 

అమరావతి : టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని, ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఎస్ జీ డిఐజి సమర్ దీప్ సింగ్  నేతృత్వంలోని బృందం గురువారం తనిఖీ చేసింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత  పార్టీ కార్యాలయానికి వచ్చిన సమర్ దీప్ సింగ్   బృందం ప్రతి అంతస్తుకి, ప్రతి గదికీ వెళ్లి నిశితంగా పరిశీలించింది.  Chandrababu చాంబార్ ఎక్కడ? ఆయన సందర్శకుల్ని ఎక్కడ కలుస్తారు? ఆయనను కలిసేందుకు వచ్చేవారిని ఎలా తనిఖీ చేస్తున్నారు?  ఏ ఏ పరికరాలను వినియోగిస్తున్నారు? స్థానిక పోలీసులు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు?  వంటి విషయాలన్నీ ఆయన కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. టిడిపి కార్యాలయ కార్యదర్శి. ఎమ్మెల్సీ అశోక్ బాబు.. ఎన్ఎస్ జీ డీఐజీకి అన్ని వివరాలు తెలియజేశారు.

ఆ తర్వాత సమర్ దీప్ సింగ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని, అక్కడ భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. పలువురు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను సైతం ఎన్ఎస్ జీ డీఐజీ కలిసినట్లు సమాచారం. చంద్రబాబు పర్యటనల్లో ఇటీవల వైసిపి నాయకులు తరచూ గొడవలు సృష్టించి ఉండడం కొన్నినెలల క్రితం టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో అల్లరిమూకల దాడి.. తాజాగా కుప్పంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి.. వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు.

కుప్పం నుండే ధర్మపోరాటం: జగన్ మీద చంద్రబాబు నిప్పులు

చంద్రబాబుకి కల్పిస్తున్న భద్రతను పర్యవేక్షించేందుకు ఎన్ఎస్ జీ డీఐజీ రావడం అందులో భాగమేనని అంటున్నారు. ‘వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన ఇంటి గేట్లను తాళ్లతో కట్టేశారు. ఆయన అమరావతి పర్యటనకు వెడితే బస్సుపై రాళ్లేసారు. పైగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని అప్పటి డిజిపి ఆ చర్యను సమర్థించారు. ప్రస్తుత మంత్రి,  అప్పటి ఎమ్మెల్యే జోగి రమేష్..  చంద్రబాబు ఇంటిపైకి దాడికి వచ్చారు.

చంద్రబాబు ఎప్పుడు కుప్పం వెళ్లినా ఏదోరకమైన అవరోధాలు సృష్టించాలని చూస్తున్నారు. ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్న వారికి డబ్బులు ఇస్తామని చెప్పి వైసిపి నాయకులు రౌడీ ముక్కల్ని  ఉసిగొలుపుతున్నారు. చంద్రబాబుని భౌతికంగా కూడా ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. అందుకే ఆయన భద్రతపై కేంద్రం స్పందించింది. చంద్రబాబు రక్షణపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి లేకపోవడం సిగ్గుచేటు’ అని అశోక్ బాబు పేర్కొన్నారు.

click me!