విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో అద్దెకు బైక్‌, కార్లు.. నామమాత్రపు చార్జీలతో అందుబాటులోకి..

By telugu teamFirst Published Sep 4, 2021, 4:42 PM IST
Highlights

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఇ-బైక్, ఇ-కార్లు అద్దెకు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ మోటార్ బైక్ రెంటల్ కంపెనీ ఈ సేవలను స్టేషన్‌లో అందించడానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. దీనిని డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఇక్కడి నుంచి టూరిస్టులు, ప్యాసింజర్లు, ఇతరులు నామమాత్రపు చార్జీలతో గంటల చొప్పున లేదా రోజుల చొప్పున ఇ-బైక్ లేదా ఇ-కార్లను అద్దెకు తీసుకోవచ్చు.
 

విశాఖపట్నం: ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ వినూత్న సదుపాయానికి శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో అద్దెకు ఇ-బైక్, ఇ-కార్‌లను అందుబాటులోకి తెచ్చే విధానాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా విశాఖపట్నంలో అద్దెకు ఇ-బైక్‌లు ఇ-కార్లు అందుబాటులోకి వచ్చాయి. నగరానికి విచ్చేసే పర్యాటకులు, ప్రయాణికులకు మరో వసతిని చెంతకు చేరుస్తూ పర్యావరణ హిత వాహనాలను అద్దెకు అందించే ఓ సంస్థకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఫెసిలిటీని డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ సత్పతి శనివారం ప్రారంభించారు.

ప్రముఖ మోటార్ బైక్ రెంటల్ కంపెనీ దాని బ్రాంచ్‌ను విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ నెం.1 దగ్గర ఏర్పాటు చేసింది. భిన్నమైన ఇ-బైక్‌లు, ఇ-కార్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు ఎవరైనా ఇ-కార్ లేదా ఇ-బైక్‌ను గంటల చొప్పున లేదా రోజుల చొప్పున అద్దెకు తీసుకుని నగర అందాలను ఆస్వాదించవచ్చు. ఈ సదుపాయాన్ని టూరిస్టులు, ప్యాసింజర్లు, స్టేషన్‌లోని ప్రజలు నామమాత్రపు చార్జీలకే వినియోగించుకోవచ్చని డీఆర్ఎం అనూప్ వివరించారు. ఇవి ఎలక్ట్రానిక్ వాహనాలు అందిస్తున్నాయని, తద్వారా పర్యావరణ హితాన్ని చాటిచెప్పినట్టవుతుందని తెలిపారు. 

వీటితోపాటు సత్యసాయి సేవా సమితి బహూకరించిన రెండు వాటర్ కూలర్లను ప్లాట్‌ఫామ్ నెంబర్ 1, 8ల దగ్గర ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫామ్ నెంబర్ 1 దగ్గర మల్టీపర్పస్ స్టాల్‌నూ డీఆర్ఎం ప్రారంభించారు.

click me!