
TDP national general secretary Nara Lokesh: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సామాన్యుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని హితవుపలికారు. పోలీసుల కర్తవ్యం తనకు అడ్డంకులు కలిగించడం కాదనీ, రేపిస్టులు, హంతకులు, గ్యాంగ్ స్టర్లకు చెక్ పెట్టడం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును విచిత్రంగా ఉందని అన్నారు.
వివరాల్లోకెళ్తే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తన 'యువగళం' పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకుంటున్నాయి. తన పాదయాత్ర యువగళంలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని సదాశివపురం, మోదుగులపాడు గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ.. 'నేను ఉపయోగించకపోయినా పోలీసులు నా మైక్ లాక్కుని బెంచీ లాగుతున్నారు' అని అన్నారు. రాష్ట్ర పోలీసుల తీరు కొంత వింతగా ఉందనీ, రోజురోజుకూ మారుతోందని అభిప్రాయపడ్డారు.
పోలీసుల కర్తవ్యం తనకు అడ్డంకులు కలిగించడం కాదని అన్నారు. రేపిస్టులు, హంతకులు, గ్యాంగ్ స్టర్లకు చెక్ పెట్టడంపై పోలీసులు దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సామాన్యుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సూచించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదని, యువత ఉపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తనకు సమస్యలు సృష్టించే బదులు ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టండి అని సీఎంకు సూచించారు. రాష్ట్రంలో పోలీసుల తీరు, ప్రభుత్వ తీరులో ప్రజా సమస్యలు పట్టించుకునే విధమైన మార్పు రావాలని అన్నారు.
తన పాదయాత్రలో భాగంగా మడి బాల, రాజుల కండ్రిగ రైతులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రైతుల సమస్యలు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డిని హాలిడే సీఎంగా అభివర్ణించిన ఆయన వైసీపీ పాలనలో క్రాప్ హాలిడేస్, పవర్ హాలిడే, ఆక్వా హాలిడేలు ఎక్కువవుతున్నాయని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేశ్.. రైతుల సమస్యల పరిష్కారానికి టీడీపీ త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తుందని చెప్పారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు, రైతుల ఆత్మహత్యలు, పంటకు గిట్టుబాటు ధర (తక్కువ ఎంఎస్పీ) లతో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిన రికార్డు సృష్టించిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, నారా లోకేశ్ యవగళం పాదయాత్ర 24 రోజుల్లో 329.1 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇది గురువారం సాయంత్రం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.