
ప్రజల్లో హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకంగా టీవీల్లో ప్రత్యేకంగా ప్రకటనలు కూడా చూపిస్తున్నారు. పలు రాష్ట్ర్రాల్లో హెల్మెట్ తప్పనిసరి చేస్తూ..ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీ చేశాయి. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించిన వారికి జరిమానాలను కూడా విధిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు వినూత్న పద్ధతిని ప్రవేశపెడుతోంది.
ప్రభుత్వాలు ఎన్ని రూల్స్ పెట్టినా.. ఇప్పటికీ చాలా మంది హెల్మెట్ లేకుండానే వాహనాలు నడుపుతున్నారు. దీంతో.. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కేవలం హెల్మెట్ ఉన్నవారికి మాత్రమే పెట్రోల్ అమ్మేలా చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అంతేకాకుండా హెల్మెట్ ధరించనివారికి జరిమానాలు కూడా విధిస్తామన్నారు. భవిష్యత్‌లో వాహన తనిఖీలు మరింత పెంచుతామని చెప్పారు. వాహనదారులు శిరస్త్రాణం ధరించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధిక సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలు పిల్లలకు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. శిరస్త్రాణం ధరించేలా చూసే బాధ్యత కూడా వారిదేనని పేర్కొన్నారు.
ఇప్పటికే.. రాజధాని ప్రాంతంలో వాహనదారులకు పలు నిబంధనలు విధించిన ప్రభుత్వం.. మరిన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. మన దేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. దానిని నివారించేందుకే ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయి.