వైసిపి ఎమ్మెల్యేల ఆరోపణలపైనే సిబిఐ విచారణ...సిద్ధమా జగన్ రెడ్డి: చినరాజప్ప సవాల్

By Arun Kumar PFirst Published Jun 11, 2020, 8:36 PM IST
Highlights

ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన రూపకల్పనలు, చిత్తశుద్ది కనబరచే నిర్ణయాలు అభివృద్దికి పెద్ద పీట వేస్తాయని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

గుంటూరు: ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన రూపకల్పనలు, చిత్తశుద్ది కనబరచే నిర్ణయాలు అభివృద్దికి పెద్ద పీట వేస్తాయని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కానీ ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో నిర్ణయాలు తీసుకుంటోందని... వీటివల్ల ప్రజలకు ఉపయోగం ఏమిటి?  రాష్ట్రం  అధోగతిపాలవడం తప్ప అని మండిపడ్డారు. 

''వైసిపి నాయకులు అసంబద్ద  విధానాలతో, అనాలోచిత నిర్ణయాలతో, స్వార్ద రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారు. ఏడాది పాలనంతా మురికి కూపంగా మారి తిట్ల దండకాలతో,చౌకబారు విమర్శలతో ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు. జగన్ చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలపై చట్ట వ్యతిరేక చర్యలపైన ఉన్నత న్యాయస్థానాలు పదే పదే తీవ్రమైన వ్యాఖ్యలు చేశాయి''  అని అన్నారు. 

''ఈ రోజు క్యాబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు  జగన్ వికృత చర్యలకు మరోసారి అద్దం పట్టాయి. బడుగు, బలహీన వర్గాల మహిళలకు రూ. 75వేలు ఇస్తానని హామీనిచ్చి నేటి క్యాబినేట్ రూ.50వేలకు కుదించడం మాట తప్పడం, మడమ తిప్పడం కాదా? పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో నియోజకవర్గాలలో వైకాపా ఎమ్మెల్యేలు దోచుకుంటున్న ప్రజాధనంపై బహిరంగ చర్చకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమా..? దీనిపై సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదు..?'' అని ప్రశ్నించారు. 

''రీచ్ ల నుంచి బయలుదేరిన ట్రాక్టర్లు మధ్యలోనే మాయం అవుతున్నాయని.. సాక్షాత్తూ వైకాపా ఎమ్మెల్యే, ఎంపీలే ఆరోపిస్తుంటే ప్రభుత్వం కనీసం వివరణ ఇవ్వలేకపోయింది. ఏడాదికి రూ.5వేల కోట్ల మీ జే ట్యాక్స్ కోసం నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీనిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? రాజ్యాంగ విరుద్ధంగా మీరు చేస్తున్న చర్యలు, ప్రజాధనాన్ని వృధా చేసిన మీ రంగుల రాజకీయంపై సీబీఐ విచారణకు సిద్ధమా..?'' అని సవాల్ విసిరారు. 

''ప్రజాప్రయోజిత అంశాలపై సీబీఐ విచారణ చేపట్టకుండా, బ్లాక్ మెయిల్, ఫిరాయింపులు ప్రోత్సహించే అంశాలపై సీబీఐ విచారణ చేపట్టాలని చూడటం మీ చేతగానితనానికి నిదర్శనం. కోర్టు తీర్పులతోనైనా వైకాపా ప్రభుత్వంలో మార్పు వస్తే.. ప్రజలు హర్షిస్తారు. అంతేగానీ కక్ష సాధింపుకు ప్రాధాన్యమిస్తే మాత్రం ప్రజాకోర్టులోనూ మరోసారి ఘోర పరాభవం తప్పదు'' అని నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. 


 

click me!