జగన్ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టుకు ఎక్కిన నిమ్మగడ్డ: లంచ్ మోషన్ల కొట్టివేత

Published : Jan 29, 2021, 10:22 PM ISTUpdated : Jan 29, 2021, 10:30 PM IST
జగన్ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టుకు ఎక్కిన నిమ్మగడ్డ: లంచ్ మోషన్ల కొట్టివేత

సారాంశం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదిగా ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను చేర్చేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 

పంచాయతీరాజ్ శాఖ మఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని, గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కూడా ఆయన ప్రతివాదులుగా చేర్చారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పాటించడం లేదని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. 

రేపు, ఎల్లుండి సెలవులు కావడంతో విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

గ్రామ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఓటర్ల జాబితా సవరించకుండా ఎన్నికలు నిర్వహించడం సరి కాదని, దానివల్ల చాలా మంది ఓటు హక్కును కోల్పోతున్నారని అంటూ ఎన్నికలను రద్దు చేయాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు పది పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ దశలో ఎన్నికలను రద్దు చేయడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్ఈసీకి సహకరిస్తామని జగన్ ప్రభుత్వం చెప్పింది. దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. తొలి విడత సిబ్బంది సహకరించకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో తొలి విడతను చివరి విడతగా మారుస్తూ ఆయన ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. 

ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా వ్యవహరిస్తూ అధికారులపై విరుచుకుపడుతున్నారు. ప్రవీణ్ ప్రకాశ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆయన సీఎస్ కు సూచించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని పదవి నుంచి తొలగించాలని కోరుతూ గవర్నర్ కు లేఖ రాశారు. 

మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిలపై కూడా ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేదిపై, గిరిజా శంకర్ మీద చర్యలు తీసుకోవాలని అంతకు ముందే ఆయన సీఎస్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఆయన జిల్లా పర్యటనలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu