జగన్ మీద దాడి కేసుపై ఎన్ఐఎ విచారణ: హీరో శివాజీకి తిప్పలేనా?

By pratap reddyFirst Published Jan 21, 2019, 5:15 PM IST
Highlights

జగన్ మీద దాడి జరిగిన తర్వాత అంతా శివాజీ చెప్పినట్లే జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ పై బిజెపి కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసు హీరో శివాజీ మెడకు కూడా చుట్టుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ అమలవుతోందని, ఇందులో భాగంగా ఓ ప్రముఖ నాయకుడిపై ప్రాణాలకు హాని లేకుండా దాడి జరుగుతుందని ఆయన జగన్ మీద దాడి జరగడానికి ముందే చెప్పారు. 

జగన్ మీద దాడి జరిగిన తర్వాత అంతా శివాజీ చెప్పినట్లే జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ పై బిజెపి కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 

ఇప్పుడు జగన్ పై దాడి కేసు దర్యాప్తు ఎన్ఐఎ చేతుల్లోకి వెళ్లింది. ఇప్పటికే ఎన్ఐఎ అధికారులు నిందితుడు శ్రీనివాస రావును, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను విచారించారు. ఈ కేసులో హీరో శివాజీని కూడా వారు విచారించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

జగన్ మీద దాడి జరగడానికి ముందు కొన్నాళ్లు, దాడి జరిగిన తర్వాత కొన్నాళ్లు శివాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు పెట్టలేదు. జగన్ మీద దాడి జరిగిన సమయంలోనూ ఆ తర్వాత కొన్నాళ్లు అమెరికాలో ఉన్నారు. జగన్ మీద దాడి కేసులో శివాజీని కూడా విచారించాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. జగన్ మీద దాడి జరుగుతుందని శివాజీకి ముందే ఎలా తెలిసిందనే విషయాన్ని రాబట్టాలని వారంటూ వచ్చారు. 

తాజాగా అదే విషయంపై ఎన్ఐఎ అధికారులు శివాజీని ప్రశ్నించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జగన్ మీద దాడి జరుగుతుందని ముందే ఎలా తెలిసిందని వారు శివాజీని ప్రశ్నించే అవకాశాలున్నాయని అంటున్నారు. శివాజీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే కేసులో మరింత ప్రగతి సాధించవచ్చునని ఎన్ఐఎ అధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

click me!