పోలీసులు కొట్టారంటూ జడ్జితో యూట్యూబర్ ... మెడికల్ రిపోర్ట్ తారుమారుకు సిఐడి ప్రయత్నం?

By Arun Kumar PFirst Published Jul 1, 2022, 2:15 PM IST
Highlights

గుంటూరు జిజిహెచ్ లో సిఐడి పోలీసులు హైడ్రామా  సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం అర్థరాత్రి అరెస్ట్ చేసిన గార్లపాటి వెంకటేష్ మెడికల్ రిపోర్ట్స్ తారుమారుకు పోలీసులు యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

గుంటూరు :  సోషల్ మీడియాలో సీఎం జగన్, వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని గుంటూరు జిల్లాకు చెందిన యూట్యూబర్, టిడిపి కార్యకర్త గార్లపాటి వెంకటేష్ ను సిఐడి పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అర్థరాత్రి అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ పేరిట చితకబాదినట్లు తెలుస్తోంది. ఇవాళ వెంకటేష్ ను కోర్టులో హాజరుపర్చగా  సీఐడీ పోలీసులు తనను కొట్టారని అతడు జడ్జికి చెప్పాడు. దీంతో అతడికి వైద్య పరీక్షల నిర్వహించి ఆ రిపోర్ట్స్ తమకు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

కోర్టు ఆదేశాలతో సిఐడి అధికారులు వెంకటేష్ ను వైద్యపరీక్షల కోసం జీజీహెచ్ కు తరలించారు. ఈ క్రమంలోనే జిజిహెచ్ లో హైడ్రామా నడిసినట్లు తెలుస్తోంది. వెంకటేష్ శరీరంలో ఎముక విరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలగా... ఆ రిపోర్ట్ ను తారుమారు చేసేందుకు సిఐడి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జిజిహెచ్ వైద్యులను, సిబ్బందిని మేనేజ్ చేయడానికి పోలీస్ ఉన్నతాధికారులు, ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహకులు రంగంలోకి దిగారంటూ ఓ తెలుగు మీడియాలో కథనం వెలువడింది. 

వెంకటేష్ అరెస్ట్ సమయంలో హైడ్రామా : 

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు వెంకటేష్ టిడిపికి అభిమానిస్తుంటాడు. దీంతో అతడు సోషల్ మీడియా మాధ్యమాల్లో టిడిపికి అనుకూలంగా, వైసిపి వ్యతిరేకంగా పోస్టులు పెట్టెవాడు. ఇలా సోషల్ మీడియాలో వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ కు వ్యతిరేక ప్రచారం చేస్తున్నవారిపై దృష్టిపెట్టిన ఏపీ సిఐడి అధికారులు వెంకటేష్ అరెస్ట్ కు సిద్దమయ్యింది. 

ఈ క్రమంలోనే ధరణికోటలోని వెంకటేష్ ఇంటికి గత బుధవారం అర్థరాత్రి సిఐడి అధికారులు సివిల్ డ్రెస్ లో వెళ్లారు. ఒకేసారి ఇంతమంది అర్థరాత్రి రావడంతో భయపడిపోయిన వెంకటేష్ కుటుంబసభ్యులు గేటు తీయలేదు. దీంతో ప్రహారిగోడ దూకి వచ్చి ఎలాగోలా గేటు తీయించారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికే వచ్చినట్లు గుర్తించిన వెంకటేష్ ఓ రూంలోకి వెళ్లి గేటు పెట్టుకున్నాడు. అతడు ఇంట్లోకి వచ్చిన పోలీసులను వీడియో తీస్తుండగా అడ్డుకోడానికి ప్రయత్నించారు. అది సాధ్యంకాకపోవడంతో ఇంట్లోని లైట్లను పగలగొట్టారు. 

ఇలా నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి రోజు అంటూ గురువారమంతా విచారణ పేరిట తమ కస్టడీలోనే వుంచుకుని ఇవాళ న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలోనే విచారణ పేరిట తనను పోలీసులు కొట్టారని వెంకటేష్ జడ్జికి చెప్పడంతో వైద్య పరీక్షలకు ఆదేశించారు. దీంతో సీఐడి పోలీసులు తమ తప్పు కప్పిపుచ్చుకోడానికి వెంకటేష్ మెడికల్ రిపోర్ట్ తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. 
 
వెంకటేష్ అరెస్ట్ పై లోకేష్ సిరియస్:  
 
యూట్యూబర్ వెంకటేష్ అరెస్ట్ పై స్పందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ పోలీసులపై లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మీడియాను చూస్తేనే కాదు సోషల మీడియాను చూసికూడా వణికిపోయే పిరికోడని లోకేష్ అన్నారు. యూట్యూబ్ ఛానెల్స్ లో వచ్చే థంబ్ నెయిల్స్ చూసికూడా జడుసుకునే సీఎం ఈ జగన్ రెడ్డి. అలాంటి జగన్ రెడ్డి సింగిల్ గా వచ్చే సింహం అంటూ వైసిపి నాయకులు చెప్పుకుంటున్నారని... కానీ ఆయన వీధి కుక్క కూడా కాదని ఎద్దేవా చేసారు. ఇలాంటి పిరికోడు పిల్లల ముందు బిల్డప్ ఇస్తూ నా ఎంట్రుక కూడా పీకలేరంటూ స్టేట్ మెంట్స్ ఇవ్వడం ఎందుకు? అంటూ లోకేష్ నిలదీసారు. 

ఏపీ పోలీసుల తీరుపైనా లోకేష్ సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త, యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు వెంకటేష్ ను అర్థరాత్రి అరెస్ట్ చేయడాన్ని లోకేష్ ఖండించారు. అర్ధరాత్రి సివిల్ డ్రెస్ లో వచ్చిన పోలీసులు కనీసం ఐడెంటిటీ కార్డు చూపించకుండా వెంకటేష్ కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేసారని అన్నారు. ఇంటి గేటును  తెరవాలని... లేదంటే మీపైనా కేసులు పెట్టాల్సి వస్తుందని వెంకటేష్ కుటుంబాన్ని బెదిరించడం దారుణమన్నారు.  

పోలీసులు అర్ధరాత్రి దొంగల్లా వెంకటేష్ ఇంటి ప్రహారిగోడ దూకడం, గునపాలతో తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించి భయానక వాతావరణం సృష్టించారని లోకేష్ తెలిపారు. ఇలా కొంతమంది పోలీసులు వైసిపి గూండాలను మించిపోయారని అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే ఇంత రాద్దాంతం చేస్తారా? అంటూ పోలీసులపై లోకేష్ మండిపడ్డారు. 
 

click me!