
చిత్తూరు: ఇటీవల కాలంలో దొంగలు అతితెలివిని ప్రదర్శిస్తూ చోరీలకు పాల్పడుతున్న అనేక సంఘటనలు బయటపడుతున్నా ప్రజలు మాత్రం జాగ్రత్తపడటం లేదు. ముక్కూ మొహం తెలియని వారిని నమ్మి మోసపోతున్నారు. ఇలా పట్టపగలే నాటకీయ పద్దతిలో ఇంట్లోకి చొరబడిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లాలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన గణేష్ రైతు. అతడు ప్రతిరోజూ వ్యవసాయ పనుల కోసం భార్యతో కలిసి పొలానికి వెళుతుంటాడు. ఈ సమయంలో ఇంట్లో అతడి తల్లి మోహనమ్మ మాత్రమే వుండేది. దీంతో ఈ ఇంటిపై దొంగల కన్ను పడింది. దీంతో నాటకీయ పద్దతిలో ఆ ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు.
సోమవారం ఉదయం 11గంటలకు తిమ్మాపురం గ్రామానికి 4బైక్స్ పై ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు చేరుకున్నారు. పిల్లులను పడతామంటూ గ్రామస్తులను నమ్మించి గణేష్ ఇంటివద్దకు చేరుకున్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఓ మహిళ గణేష్ తల్లిని మాటల్లో పెట్టగా మిగతావారు పిల్లులను పట్టే నెపంతో ఇంటి వెనకకు చేరుకున్నారు. వెనక ద్వారం నుండి ఇంట్లోకి చొరబడి బీరువాలోని 7.5 సవర్ల బంగారు నగలు, 180 గ్రాముల వెండి గొలుసుతో పాటు కొంత నగదును దోచుకెళ్లారు.
సాయంత్రం ఇంటికి చేరుకున్న గణేష్ దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పిల్లులు పట్టే నెపంతో గ్రామంలోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా గ్రామాల్లో సంచరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.