ఏపీలో కొత్త చట్టం.. గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్

By Galam Venkata Rao  |  First Published Jul 16, 2024, 12:46 AM IST

గుజరాత్‌లో విజయవంతమైన భూ రక్షణ చట్టాలను ఆధారంగా తీసుకుని ఏపీలో కొత్త ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ చట్టం భూ కబ్జాలను అరికట్టడంతో పాటు, భూ హక్కుల రక్షణను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు.


వైఎస్సార్‌ కాంగ్ఎస్‌ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా చంద్రబాబు ప్రభుత్వం తవ్వుతోంది. ఇప్పటికే అమరావతి, పోలవరం, ఇంధన రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... తాజాగా సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. వెలగపూడి సచివాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ రూపంలో వెల్లడించారు. గత జగన్‌ ప్రభుత్వం భూములను విచ్చలవిడిగా దోచిపెట్టిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అది 2020 నుంచి గుజరాత్‌లో అమలులో ఉందని చెప్పారు. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా భూమిని కబ్జా చేస్తే ఆ భూమి వారిదని వారే నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పేదలు, సామాన్యుల భూములకు దీని ద్వారా రక్షణ లభిస్తుందని తెలిపారు.

అలాగే, రాష్ట్రంలోని భూగర్భ ఖనిజ సంపదనంతా వైసీపీ దోచేసిందని సీెం చంద్రబాబు ఆరోపించారు. ‘‘ఇసుక అక్రమాల్లో రూ.7 వేల కోట్లు దోచేశారు. సీనరేజీలో రూ.వెయ్యి కోట్లు దోచేశారు. మైనింగ్ క్వారీ లీజుదారులను బెదిరించి, ఫైన్లు వేసి లాక్కున్నారు. బెదిరింపులకు భయపడకపోతే ఇష్టానుసారంగా ఫైన్లు వేశారు. దీంతో భరించలేక క్వారీలను వదిలిపెట్టి పోయారు. అటవీ భూముల్లో కూడా మైనింగ్‌కు పాల్పడ్డారు. రాష్ట్రంలో సుమారు రూ.19వేల కోట్ల విలువైన సహజ వనరులను దోచేశారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Latest Videos

ఇసుక దోపిడీకి అదుపే లేదు... 

‘‘ఐదేళ్ల పాటు ఇసుక తవ్వకాల్లో డాక్యుమెంట్లు లేకుండా చేశారు. కీ  రెగ్యులేషన్‌ను అతిక్రమించారు. మినరల్ రెవెన్యూలో రూ.9,750 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. 2014-19మధ్య ఉచితంగా ఇసుక అందించాం. నిర్మాణ రంగం బాగా నడిచింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నూతన ఇసుక పాలసీ వల్ల ప్రియం చేసింది 130 మంది కార్మికులు పనుల్లేక చనిపోయారు. జేపీ వెంచర్స్ ను తెచ్చారు. ఇష్టానుసారంగా వైసీపీ వాళ్లు కూడా ఎక్కడికక్కడ తవ్వేశారు. జీఎస్టీ చెల్లించలేదు. బయటి వ్యక్తులను తెచ్చి చెప్పి ఎన్ని అవకతవకలు చేయాలో అన్నింటినీ చేశారు. ఇసుక తవ్వకాల కోసం నదుల్లో రోడ్లు వేసి ర్యాంపులు కట్టారు. తవ్వకాలు ఆపాలని ఎన్జీటీ చెప్పినా వినలేదు. దండా నాగేంద్ర అనే వ్యక్తి ఇసుక తవ్వకాలపై కోర్టుకు వెళ్లినందుకు అట్రాసిటీ కేసు పెట్టారు. నేను కూడా క్షేత్రస్థాయిలో ఎన్నో ఇసుక గుట్టలను పూపించాను. కడపలో రాయల్టీ పెంచడంతో ఆత్మహత్య చేసుకుని ఓ వ్యక్తం చనిపోయారు. ఇసుకలో టీడీపీ హయాంలో మొదట రూ.966 కోట్ల ఆదాయం నుండి రూ.2463 కోట్లకు పెరిగింది. కానీ వైసీపీ రూ.2072 కోట్ల నుండి రూ.3425 కోట్ల వద్దే ఆగిపోయింది. టీడీపీ హయాంలో నిలకడగా పెరుగుతూ వచ్చింది. టీడీపీ హయాంలో గ్రోత్ రేట్ 150 శాతం ఉంటే..వైసీపీ హయాంలో 40 శాతం మాత్రమే ఉంది. సీఏజీర్ 24 శాతం పెరిగితే వైసీపీ హయాంలో 7 శాతం మాత్రమే పెరిగింది. ఇదంతా అవినీతి, దోపిడీ చేయడం వల్లే. అటవీ, మైనింగ్ శాఖలు ఒక వ్యక్తికే ఇచ్చారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఐదేళ్లు ఇష్టానుసారంగా దోచేశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై తప్పుకుండా చర్యలు తీసుకుంటాం. పాత డాక్యుమెంట్లు పెట్టి ఇసుక తవ్వకాలు జరగలేదని కోర్టుకు సమర్పించారు.’’

క్వార్ట్జ్, సిలికా లీజుదారులకు బెదిరింపులు...

‘‘నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ దోచేశారు. లీజ్ ఓనర్లను బెదిరించి వైసీపీ నేతలు చెప్పిన రేటుకే... వారికే అమ్మేలా చేసుకున్నారు. శ్రీకాకుళంలో రూ.215 కోట్లు గ్రానైట్ పై ఫైన్లు వేశారు. క్వార్ట్జ్, లేటరైట్ దోచేశారు. సొంత సిమెంట్ ఫ్యాక్టరీలకే లేటరైట్ సప్లై చేసుకున్నారు. ప్రకాశం జిల్లా 155 క్వారీలపై దాడులు చేశారు...వారిలో కొంతమంది దారికి రాగా 23 మందిపై రూ.614 కోట్లు ఫైన్లు వేశారు. చిత్తూరు జిల్లాలో రూ.248 కోట్లు ఫైన్లు వేశారు. పెద్దిరెడ్డి వారి మనుషులకు, కావాల్సిన వారికి ఇష్టానుసారంగా లీజుకు అప్పగించారు. కుప్పంలో కూడా గ్రానైట్ దోచేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి కూడా అవస్థలు పడ్డాం. ద్రవిడ యూనివర్సిటీలో కూడా అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాడిన మా నేతలపై కేసులు పెట్టారు. ఈ సంపదంతా ప్రజలది...దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. మెటల్ క్వారీలు కూడా బలవంతంగా లాక్కున్నారు. ఇకపై ఎవరి క్వారీలు వారే నిర్వహించుకోండి.. మా ప్రభుత్వం అండగా ఉంటుంది.’’ 

పోలవరం కాలువ తవ్వేసి... 

‘‘పోలవరం కుడి కాల్వను తవ్వేసి రూ.800కోట్ల విలువ చేసే మట్టిని తరలించారు. వరదలు వస్తే కాల్వలు ఎలా తట్టుకోగలుగుతాయి.? అమరావతిలో రోడ్లను తవ్వుకుపోయారు. ఎర్ర చందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా తగ్గించేశారు. మా హయాంలో 6వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించాం. కానీ వైసీపీ 836 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని మాత్రమే విక్రయించింది. ఏ విధంగా దోచుకున్నారో చూడాలి. స్మగ్లించ్ చేసిన ఎర్రచందనాన్ని చైనా, ఇతర దేశాలకు పంపించారు. స్మగ్లింగ్ తో వచ్చిన ఆదాయంతో రాజకీయాల్లోకి వచ్చారు. స్మగ్లర్‌ను తెచ్చి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.441 కోట్ల ఆదాయం మాత్రమే ఎర్రచందనాన్ని విక్రయించడం వల్ల వచ్చింది. మా హయాంలో రూ.1623 కోట్ల ఆదాయం వచ్చింది. స్మగ్లింగ్ సమాజానికే చాలా ప్రమాదం. పుంగనూరు, చిత్తూరు, పల్నాడు ప్రాంతాల్లో అడవులను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు కాలజ్ణానం రాసిన రవ్వల కొండను తవ్వేశారు. విశాఖలో రుషికొండను తవ్వేసి ప్యాలెస్ కట్టారు. ఇది ఎందుకు కట్టారు అంటే పీఎం వచ్చినప్పుడు ఉండటానికి అని కబుర్లు చెప్పారు. 500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. దాన్ని ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. ప్రజలకు సేవకులుగానే ఉండాలి తప్ప...రాజులుగా ఉండకూడదు. స్వేచ్ఛగా ఎవరి వ్యాపారం వారు చేసుకునే వాతావరణం కల్పిస్తాం. ప్రజాస్వామ్యంలో గత పాలకులు ఉండాల్సిన అవసరం ఉండకూడదు. దోపిడీ జరిగిందని ప్రజలు చెప్తే వారిపై దాడులు చేశారు...వార్తలు రాసిన మీడియాను బెదిరించారు. దొంగలకు తాళాలు ఇచ్చి దోచుకునేలా చేశారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

click me!