
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల అవతరణకు ముహుర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 4వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. ఆ రోజు నుంచే కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కానుంది. ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ కార్యక్రమం జరగనుంది. తొలుత కొత్త జిల్లాల నుంచి ఉగాది రోజున పాలన ప్రారంభించాలని భావించారు. అయితే ముహుర్తం, ఇతర అంశాలను పరిగణలోని తీసుకన్న ప్రభుత్వం.. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లా ప్రారంభోత్సం జరపాలని నిర్ణయించింది.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 26 జిల్లాలకు కేబినెట్ వర్చువల్ విధానంలో ఆమోద ముద్ర వేసింది. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి.
కొత్తగా 22 రెవెన్యూ డిజిన్లను ఏర్పాటు చేయనున్నారు. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తిలు కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం.
ఇక, ఈ ఏడాది జనవరి 26న కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిపై ప్రభుత్వం అభ్యర్థలను స్వీకరించింది. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు ఫిర్యాదులు అందాయి. సుమారు 10 వేలకు పైగా ఫిర్యాదులు, సలహాల, సూచనలు అందాయి. వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకొనుంది.