ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి వచ్చిన వినతుల ఆధారంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.ఇవాళ లేదా రేపు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు ఫిర్యాదులు అందాయి. సుమారు 10 వేలకు పైగా ఫిర్యాదులు, సలహాల, సూచనలు అందాయి. వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకొనుంది. ఈ నెల 4వ తేదీ నుండి కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది జనవరి 26న కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల్లో రెవిన్యూ డివిజన్లు, జిల్లా కేంద్రాలు, జిల్లాల పేర్ల వంటి విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి పదివేలకు పైగా ఫిర్యాదులు, సలహాలు అందాయి. వీటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించింది. ప్రజల నుండి వచ్చిన వినతులపై సీఎం నిర్ణయం తీసుకొంటారు.
undefined
కొత్త జిల్లాల నుండి పాలన సాగించే విషయమై సీఎం జగన్ అధికారులతో బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు. రాజంపేట , హిందూపురం, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని డిమాండ్లున్నాయి.కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల కోసం వేల సంఖ్యలో ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. ఈ విషయమై ప్రభుత్వానికి వచ్చిన వినతులపై సీఎం జగన్ కు అధికారులు వివరించనున్నారు. ఈ రోజు లేదా రేపు కొత్త జిల్లాల ఏర్పాటు పై ఏపీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది.ఎన్నికల మేనిఫెస్టోలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై జగన్ సర్కార్ కసరత్తును ప్రారంభించింది. ఉగాది నుండి ఏపీ లో కొత్త జిల్లాల నుండి పాలన ప్రారంభించాలని జగన్ సర్కార్ భావించింది. అయితే ముహుర్తాలను చూసుకొన్న తర్వాత ఉగాది కంటే ఏప్రిల్ 4వ తేదీన ముహుర్త బలం బాగుందని వేద పండితులు సూచించడంతో ఏప్రిల్ 4న కొత్త జిల్లాల నుండి పాలన ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9:05 గంటల నుండి 9:45 గంటల మధ్య కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది జనవరి 26న విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో 90 శాతం మేరకు కొత్త జిల్లాలు ఉండనున్నాయి. ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు కొన్ని జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు చోటు చేసకొనే అవకాశం ఉంది. ఈ విషయమై ఇవాళ సమీక్షలో సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం జగన్ సూచనల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ విడుదల కానుంది.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై కూడా అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు కొన్ని అభ్యంతరాలున్నాయి.ఈ విషయాన్ని మీడియా వేదికగా కూడా వ్యక్తం చేశారు. ఈ విషయాలను కూడా సీఎం పరిశీలించే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ప్రతిపాదించిన అంశాలపై కొన్ని జిల్లాల్లో ఆందోళనలు సాగుతున్నాయి.ఈ విషయాలపై కూడా సీఎం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.