ఏపీ అసెంబ్లీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. తన సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం నాడు నిరసనకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ బయట కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే తన సమస్యలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ విషయమై స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకున్నారు. సమస్యలకు సంబంధించిన అంశాలను తనకు ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి సూచించారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించవద్దని కోరారు. ఈ విషయాలపై ప్రభుత్వం స్పందించనుందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయమై జోక్యం చేసుకున్నారు.
ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలతో ప్రజా ప్రతినిధులు ఉంటారన్నారు. సమస్యలు లేని సమాజం ఉండదన్నారు. ఏ వేదికలో ఏ అంశాలను ప్రస్తావించాలనేది ముఖ్యమని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో వ్యక్తిగత అంశాలపై చర్చకు శ్రీధర్ రెడ్డి పట్టుబట్టడంపై మంత్రి బుగ్గన రాజేందనాథ్ రెడ్డి తప్పుబట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమస్యలపై సంబంధిత మంత్రులకు కానీ, తనకు కానీ వినతిపత్రాలు అందిస్తే వాటిని పరిష్కరించనున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను ప్రభుత్వం సమానంగా చూస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హామీ ఇచ్చారు.
undefined
ఇదే విషయమై మమరో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అసెంబ్లీలో రగడ సృష్టించేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి నోరెత్తగానే ఆయనకు మద్దతుగా టీడీపీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్నారని మంత్రి రాంబాబు చెప్పారు. సభను డిస్టర్బ్ చేయడం కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. సభలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ తరపున మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డిపై టీడీపీ సభ్యులకు ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి నమ్మకద్రోహులకు ప్రజలు బుద్ది చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.
also read:తొమ్మిది రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 16వ తేదీన సభలో బడ్జెట్.. బీఏసీలో నిర్ణయం.
అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. శ్రీధర్ రెడ్డి నిరసన సాగుతున్న సమయంలోనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.